ఆగిరిపల్లి: పొలంలో మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని అధికార పార్టీ నాయకులు మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని కొమ్మూరు రిజర్వాయర్ పరిధిలో కృష్ణవరం, సురవరం, కొమ్మూరుకి చెందిన వారు పొలాలు మెరక కోసమని అనుమతులు తీసుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు కృష్ణవరం గ్రామంలో చెరువుని ఆనుకుని ఉన్న 8 ఎకరాల ముంపు పొలానికి మట్టిని తరలిస్తున్నారు. పొక్లయిన్లతో తవ్వి 50 ట్రాక్టర్లలో వందలాది ట్రిప్పులు ఇలా తరలించేశారు. గ్రామంలో మెరక పొలాలకు కాకుండా ఆ ఒక్క పొలానికి మట్టిని ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు విరుద్ధంగా రాత్రిళ్లు కూడా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు.


