ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులను ఆర్టీసీ లేదా ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని, వాటిని పూర్తిగా ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్న బస్సుల్లో జీరో టికెట్ విధానాన్ని నిలుపు చేయాలని, పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని, 4 డీఏల ఏరియర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కుటుంబాలకు సెటిల్‌మెంట్స్‌లో జాప్యాన్ని నివారించాలని, ఉద్యోగులను ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ నుంచి మినహాయించి, పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం గురువారం కూడా నిరసన కొనసాగిస్తామన్నారు. ఎన్‌ఎంయూ అసోసియేషన్ నాయకులు ఎస్.ప్రసాదరావు, బి.శ్రీనివాసరావు, పీసీహెచ్ శేఖర్, బి.గంగరాజు, ఎ.విజయ, పి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


