తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి
నీటి సరఫరాకు ఆటంకం ఉండదు
ప్రారంభంలో జాప్యం
భీమవరం: భీమవరం పట్టణంలోని లోసరి ప్రధాన కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతుండడంతో పలు గ్రామాలకు మంచినీటి సమస్య తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటడం, పసర్లుబారడంతో ప్రజలు తాగునీటికి పడుతున్న కష్టాలు చెప్పనలవికావు. ఈనెలాఖరుకు కాలువలకు నీరు వదులుతారని మంచినీటి చెరువులను నీటితో నింపి నీటి ఎద్దడి నివారిస్తామంటూ పంచాయతీల అధికారులు చెబుతుండగా లోసరి కాలువపై భీమవరం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కారణంగా మరికొన్ని రోజులు నీటి సరఫరా నిలిచిపోతుందనే ఆందోళన పలు గ్రామాల్లో వ్యక్తమవుతుంది.
పనులు ఇంకా గ్రౌండ్ లెవిల్‌లోనే..
భీమవరం నుంచే ప్రవహించే లోసరి ప్రధాన పంట కాలువ ద్వారా మండలంలోని గొల్లవానితిప్ప, తోకతిప్ప, గూట్లపాడు, కొత్త పూసలమూరు, దొంగపండి, లోసరి, బర్రెవానిపేట తదితర గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు లభిస్తుంది. కాలువపై నిర్మించిన వంతెనలకు ఎంతోకాలంగా అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో నిరుపయోగంగా మిగిలిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. అయితే ఎట్టకేలకు రూ.24 కోట్లు నిధులు మంజూరు కావడంతో ఏప్రిల్ 17న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో అమరావతి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారంటూ భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పవన్‌కల్యాణ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆ శంకుస్థాపన నిలిచిపోయింది. ఆ తరువాత లోసరి కాలువపై నూతనంగా నిర్మించాల్సిన వంతెన పనులు తరువాత చేపట్టారు. పనులు ప్రస్తుతం గ్రౌండ్ లెవిల్‌లోనే ఉండడంతో మరో 10 రోజుల్లో కాలువలకు నీరు వదిలినా లోసరి కాలువకు నీటి సరఫరా మరికొన్ని రోజులు నిలిపివేయాల్సి ఉంటుంది. వంతెనకు కనీసం పిల్లర్ల నిర్మాణం పూర్తిచేస్తేగాని కాలువకు నీరు వదిలే అవకాశంలేదు.
లోసరి కాలువపై నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణ పనులు
ఈనెల 31వ తేదీన కాలువలకు నీటి విడుదల
వంతెన నిర్మాణ పనులతో కాలువలకు నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రమాదం
ఇప్పటికే అడుగంటిన మంచినీటి చెరువులు
తాగునీటి కోసం ప్రజల ఆందోళన
లోసరి కాలువపై భీమవరం వద్ద వంతెన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనివల్ల ఈనెలాఖరుకు కాలువలకు నీటిని వదిలినా లోసరి కాలువకు నీటి సరఫరా కష్టమే. ఇప్పటికే తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు కాలువకు సకాలంలో నీరు వదలకపోతే గుక్కెడు నీళ్లు కోసం పడరాని పాట్లు పడాల్సి ఉంటుంది. అధికారులు స్పందించి పనులు వేగంగా చేయించి కాలువకు నీటి విడుదలలో జాప్యం లేకుండా చూడాలి.
– బోకూరి విజయరాజు, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి
లోసరి కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులు కారణంగా కాలువకు నీటి విడుదలలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. బెడ్‌లెవిల్ పనులు వేగంగా పూర్తిచేయించి నీటి సరఫరా చేయిస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– అడబాల శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ, భీమవరం
కాలువలకు నీటి సరఫరా నిలిపివేసిన వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తిచేసి నీటి సరఫరాకు అటంకం లేకుండా ఉండేదని, ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనంటూ పనుల ప్రారంభంలో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకుస్ధాపనకు భారీ ఏర్పాట్లుచేసిన అధికారులు పెద్ద మొత్తంలో ఖర్చుచేయగా కనీసం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)తోనైనా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండా జాప్యం చేయడం ప్రజలను ఇబ్బందులపాలు చేయడమేనని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా పనులు వేగంగా చేయించి నీటి సరఫరాకు అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతున్నారు.


