జంగారెడ్డిగూడెం, పోలవరం రూరల్ : రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మే ఒకటి నుంచి స్కూలు బస్సులు తనిఖీ చేస్తున్నామని రవాణాశాఖ అధికారులు ఎస్‌ఎస్ రంగనాయకులు, కేడీవీ రవిగోపాల్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. బుధవారం పోలవరం మండలంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 296 బస్సులు ఉండగా ఇప్పటివరకు మొత్తం 248 స్కూల్ బస్సులను తనిఖీ చేశామని, భద్రతా లోపాలు ఉన్న 209 బస్సులకు లోపాలను సరి చేసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. స్కూల్ బస్సులకు అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రాలు, ప్రథమ చికిత్స పెట్టే, వేగ నియంత్రణ, జీపీఎస్ పరికరాలు, అదేవిధంగా 185జి ప్రమాణాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అన్నీ చెల్లుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు.
ఆగిరిపల్లి: బైక్ దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం సగ్గూరు గ్రామానికి చెందిన యలమర్తి పుల్లయ్య తన ఇంటి ముందు ఉంచిన బైకు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై శుభశేఖర్ ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2.50 లక్షల విలువైన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన సగ్గూరు గ్రామానికి చెందిన పోతర్లంక చరణ్, కొత్త సురవరం గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన మారెళ్ళ నాగసాయిపై కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో మామిడి పండ్ల విక్రయ కేంద్రాలు, గోదాములు, పండ్ల దుకాణాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా వ్యాపారులకు రసాయనాలు ఉపయోగించి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను విక్రయించరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి హానికర రసాయనాలతో పండ్లు పండించడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని వారికి వివరించి అవగాహన కల్పించారు. వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అనుమానాస్పదంగా ఉన్న మామిడి పండ్ల నమూనాలను సేకరించి, ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ఆహార భద్రత చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలు సహజసిద్ధంగా పండిన పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, కృత్రిమంగా పండించిన పండ్లను గుర్తించిన పక్షంలో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగ గుంట గ్రామానికి చెందిన వివాహిత గెల్లా సంధ్యను పాత గొడవలను పురస్కరించుకుని అదే గ్రామానికి చెందిన కొడమంచిలి నరేష్ రాయితో కొట్టి గాయపరిచాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధిత మహిళ సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


