పెదపాడు: అప్పనవీడులో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వీ సురేష్ పర్యవేక్షణలో లెక్కించినట్లు ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. 55 రోజులకుగాను రూ.11,90,806 ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమంలో ఈఓ తారకేశ్వరరావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
భీమవరం: పట్టణంలోని ఒక ఫ్యాక్టరీ వద్ద ఉన్న డ్రెయినేజీలో సిల్ట్ తీస్తుండగా విషవాయువు ప్రభావంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఉండి రోడ్డులో ఉన్న ఒక రైస్‌మిల్లును కొన్నేళ్ల క్రితం మూసివేశారు. కాగా రైస్‌మిల్లులో మరో ఫ్యాక్టరీ నడుపుతున్నట్లుగా సమాచారం. ఆ ఫ్యాక్టరీ వద్ద డ్రెయినేజీలో సిల్ట్ తీసేందుకు భీమడోలు మండలం గుండుగొలను నుంచి ఈ నెల 19వ తేదీన నలుగురు వ్యక్తులు వచ్చారు. 20వ తేదీన కూడా ఎనిమిది మంది వచ్చారు. అందరూ కలిసి బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో మిల్లు వద్ద ఉన్న డ్రెయినేజీలో సిల్ట్ తీస్తుండగా ఏదో తెలియని విషవాయువు లాంటిది వారికి తగలడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వాలేపు వెంకన్న (45) అనే వ్యక్తి మృతి చెందాడు. వాలేపు రాజు, బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నామని టూటౌన్ ఎస్‌ఐ రెహ్మాన్ తెలిపారు. ఆ రైస్‌మిల్లులో ఏ ఫ్యాక్టరీ నడుపుతున్నారనేది చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన రాజకీయ పార్టీ నాయకుల అండదండల్లో ఆ ఫ్యాక్టరీ నడుస్తుందని గుసుగుసలు వినిపిస్తున్నాయి.


