న్యూస్‌రీల్
డీజిల్ కొరత అన్నదాతను అతలాకుతలం చేస్తోంది. ఒకవైపు కోతలు వేగంగా సాగుతున్నాయి. కోత యంత్రాలకు ధాన్యం లోడుతో తిరిగే లారీలకు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ నింపే ఏరియేటర్లు తిరగడానికి డీజిల్ అవసరం. ఇలా అన్నదాతలు, ఆక్వా రైతులకు డీజిల్ అనివార్యమైన తరుణంలో, కొరతతో అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమలో 1,900కు పైగా కోత యంత్రాలకు రోజుకు సగటున 2 లక్షల లీటర్ల డీజిల్ డిమాండ్ ఉండగా, దానిలో నాలుగో వంతు సరఫరా కూడా లేకపోవడంతో ఇబ్బందులు తీవ్రమయ్యాయి.
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పెట్రోల్, డీజిల్ సరఫరాలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎన్నికల ముందు రైతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రైతుకే తొలి ప్రాధాన్యత అని ప్రతి సభలోనూ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైనా స్పందిస్తున్నారా? క్షేత్రస్థాయిలో రైతులకు డీజిల్ అందేలా వెంటనే చర్యలు చేపట్టాలి.
– డీవీఆర్కే చౌదరి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
రైతులు కన్నీరు పెడుతున్నారు. ధాన్యం సరఫరాకు, చేపలు, రొయ్యల చెరువుల వాహనాలకు డీజిల్, పెట్రోల్ కూడా సరఫరా చేయలేకపోతే ప్రభుత్వం రైతులకు మేలు చేసినట్టేనా? క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న పాట్లు, డీజిల్ బ్లాక్ మార్కెట్ విక్రయాల పరిస్థితిని నేరుగా గమనించి, ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలి.
– ఎన్.గాంధీ, రైతు, జోగన్నపాలెం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానంగా రెండు జిల్లాల్లో కలిపి 4.25 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం మెట్ట ప్రాంతాల్లో 80 శాతం పైగా కోతలు పూర్తవగా, డెల్టాలో 40 నుంచి 50 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. జిల్లాలో వరి కోతకు హార్వెస్టింగ్ యంత్రాల వినియోగం తప్పనిసరిగా మారింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 1,600 హార్వెస్టింగ్ యంత్రాలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఎకరం కోత పూర్తి చేయడానికి సగటున 10 లీటర్ల డీజిల్ తప్పనిసరి. అదేవిధంగా ధాన్యం రవాణా చేసే లారీలకు 30 లీటర్లు, ట్రాక్టర్లకు 20 లీటర్ల మేర డీజిల్ అవసరం.
వరి కోతలు వాయిదా
ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమలో కేవలం వరి కోతలు, రవాణాకే రోజుకు సగటున 2.5 లక్షల లీటర్ల డీజిల్ డిమాండ్ ఉంది. జిల్లాలో ఆ మేరకు సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా సాగులో రొయ్యల చెరువులకు ఆక్సిజన్ నింపే ఏరియేటర్లకు ఎకరాకు సగటున 5 నుంచి 10 లీటర్ల మేర డీజిల్ అవసరం. జిల్లాలో అత్యధికంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి, ఆక్వాకు కలిపి మొత్తం 3.5 లక్షల లీటర్ల మేర డీజిల్ డిమాండ్ ఉంది. డీజిల్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కోతలు వాయిదా పడుతుండగా, ధాన్యం లోడును కళ్లాల్లోనే ఉంచుతున్నారు. వాతావరణ మార్పులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లాలో 232, పశ్చిమ గోదావరి జిల్లాలో 160 పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు సరిపడా లేని పరిస్థితి
టోకెన్లు, క్యూలైన్లు
కోత యంత్రాలకు, రైతుల ఇతర అవసరాలకు స్థానిక తహసీల్దార్ల ద్వారా టోకెన్ల పంపిణీకి ప్రభుత్వం తెరదీసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడి టోకెన్లు తీసుకుని, మళ్లీ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం యథావిధిగా బంకుల తనిఖీలు నిర్వహించడంతో పాటు కంట్రోల్ రూంలో ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు, మెడికల్, ఆర్టీసీకి ఇబ్బందులు లేకుండా టోకెన్లు జారీ చేశామని, అవసరమైన మేర డీజిల్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే ఉంది.
ఎకరా కోతకు 10 లీటర్ల డీజిల్ వినియోగం
ఆక్వాకు, ధాన్యం రవాణా లారీలకు డీజిల్ తప్పనిసరి
ఉమ్మడి పశ్చిమలో 1,900కు పైగా కోత యంత్రాలు
తహసీల్దార్లు స్లిప్పులు ఇస్తేనే యంత్రాలకు డీజిల్


