జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ మండపం వద్ద స్వామివారికి తమలపాకులతో అష్టోత్తర పూజలు జరిపారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ. 2,00,379 ఆదాయం వచ్చిందని, అన్నదాన సత్రంలో 1,925 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమగ్రశిక్ష ఏలూరు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఉర్దూ), అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారి (ఏపీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే పంకజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, సెంకడ్ గ్రేడ్ టీచర్లు తమ దరఖాస్తులను మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, మరిన్ని వివరాలకు 63032 09397 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి అతిథులుగా వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.విజయ్ కుమార్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షురాలు ఈ. సరోజ, టీమ్ సభ్యులు పాల్గొని చిన్నారులకు విజ్ఞానంతో కూడిన సందేశాన్ని అందించారు. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్‌లుగా ముందుకు వచ్చిన సుజయ్ కృష్ణ (కార్టూన్లు, స్టోరీస్) ఆర్.భాస్కర్ సాయి కుమార్ (డ్రాయింగ్, ఇతరాలు), యోహాను (చదరంగం), వై కృష్ణ ఫణికాంత్ (వెస్ట్రన్ డాన్స్) సీహెచ్‌వీ సురేంద్ర (మైండ్ మెమరీ గేమ్స్, స్కిల్స్), జీ అశోక్ కుమార్ (స్పోకెన్ ఇంగ్లీషు), జే మూర్తి (శతక పద్యాలు, భగవద్గీత, కథలు), కొడాలి హిమబిందు (తెలుగు సాహిత్యం, పద్యాలు)లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు, బిస్కట్లు పంచిపెట్టారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 15వ తేదీన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నారా లోకేష్ నివాసం వరకూ చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలోని రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయానికి వెళ్లి ఏఎస్‌పీడీని కలిసి పాదయాత్రకు సంబంధించిన నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని కేడర్లకు జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, ఎంటీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగి కుటుంబ సభ్యులతో సహా సన్నద్ధమౌతున్నామని స్పష్టం చేశారు. అలాగే కేజీబీవీ టీచర్లకు జరుగుతున్న లాంగ్ స్టాండింగ్ బదిలీలను న్యాయబద్ధంగా జరపాలని కోరారు.
ఏలూరు (టూటౌన్): రసాయనిక పరిశ్రమల్లో విపత్తు సమయంలో నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30న చింతలపూడిలో ఐఓసీఎల్ పైప్‌లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్‌లో మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి టేబుల్ టాప్ ఎక్సరసైజ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాక్ డ్రిల్‌లో సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొని, జాగ్రత్త చర్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


