డీజిల్‌ కొరత చేతకానితనమే | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ కొరత చేతకానితనమే

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసనలు

ఏలూరు టౌన్‌: రాష్ట్రంలో పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని.. డీజిల్‌ కృత్రిమ కొరతతో వాహనదారులు, వ్యాపారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. ఇది కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఏలూరులో పార్టీ నేతలు, కేడర్‌ ప్రజా నిరసన చేపట్టింది. సీఎస్‌ఐ చర్చి సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి జేపీ కొద్దిసేపు నిరసన తెలిపారు. ఆటోడ్రైవర్లు, వాహనదారులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తొలుత వైఎస్సార్‌సీపీ ఏలూరు కార్యాలయం నుంచి ర్యాలీగా నడుచుకుంటూ పెట్రోల్‌ బంకు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌ మాట్లాడుతూ.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో డీజిల్‌, పెట్రోల్‌ కొరత దుస్థితి లేదని, ఏపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గ్యాస్‌ సిలిండర్ల కొరతతో ఇబ్బందిపడ్డారని, తాజాగా డీజిల్‌ కొరత ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, నగర మహిళ అధ్యక్షురాలు విజయ నిర్మల, బీసీ సెల్‌ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇమ్మానియేల్‌ జయకర్‌, భాస్కర్ల బాచి, పల్లి శ్రీనివాస్‌, కొల్లిపాక సురేష్‌, సాయిప్రదీప్‌, రాజేష్‌, గంటా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement