ఏలూరు (టూటౌన్): డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంకు యజమానులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులోని పలు పెట్రోల్ బంకులను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి డీజిల్ నిల్వలు, సరఫరా, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనని ఆందోళనతో ప్రజలు కొనుగోళ్లకు ప్రయత్నిస్తుండడంతో సమస్య ఏర్పడుతుందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు బంకు యజమానులు డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ బంకుల ముందు నో స్టాక్‌లు పెడుతున్నారన్నారు. తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖాధికారులు తమ పరిధిలోని బంక్‌లను పరిశీలించి డీజిల్ నిల్వలు ఉన్నా నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టించే వారిపై, పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేసే బంకు యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డీజిల్‌ను ఇళ్ల వద్ద నిల్వ ఉంచవద్దని, మండే స్వభావం ఉన్న డీజిల్, వేసవి తీవ్రత దృష్ట్యా అగ్నిప్రమాదాలకు కారణమవుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టరు సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి, డీఎస్‌ఓ బాబు ఇ.బి.విలియమ్స్, తహసీల్దారు కె.గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


