● వైద్యుల నిర్లక్ష్య వైఖరితో రోగుల మరణాలు?
● మృతదేహాలకు పోస్టుమార్టం చేయని వైనం
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రికి రోగమొచ్చింది. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజూ వందలాదిమంది రోగులు అనార్యోగంతో ఏలూరు జీజీహెచ్‌కు వస్తూ ఉంటారు. కానీ రోగులకు మెరుగైన వైద్యం అందించటంలో ఘోర వైఫల్యం కనిపిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరించినా డోంట్ కేర్ అనే ధోరణితో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇటీవల వైద్యులు, సిబ్బంది ఉదాసీన వైఖరితో ఒక 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా... ఒక వృద్ధురాలు సైతం సకాలంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో మృతి చెందింది. ఇక ఎంసీహెచ్ విభాగంలో వారంలో రెండు, మూడు సంఘటనలు చోటు చేసుకోవడంతో గర్భిణులను భయబ్రాంతులకు గురి అవుతున్నారు. కుట్లు విడిపోవటం, ఇన్‌ఫెక్షన్లు రావటం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం వంటి పరిస్థితులు హాస్పిటల్ వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అత్యవసర విభాగానికి రాత్రివేళల్లో ప్రాణాపాయ స్థితిలో తీసుకెళ్తే వైద్యం అందుతుందనే గ్యారెంటీ లేదంటున్నారు. సిఫార్సులు లేకుంటే రోగి చేతిని కూడా ముట్టుకునే పరిస్థితి ఏలూరు జీజీహెచ్‌లో లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఏలూరు జీజీహెచ్‌లో కోకొల్లలుగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
బాలిక మృతితో ఆందోళన
మూడు రోజుల క్రితం పెదపాడు మండలం తాళ్లమూడికి చెందిన 14 ఏళ్ల బాలిక అనారోగ్యంతో ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేరింది. తొలుత హనుమాన్ జంక్షన్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా... ఏలూరు జీజీహెచ్‌లో మంచి వైద్యం దొరుకుతుందనే ఆశతో తల్లితండ్రి బాలికను తీసుకువచ్చారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం బాలిక ప్రాణాలు తీసింది. బాలిక నోరు, ముక్కు నుంచి నురగలు కక్కుతూ మృతి చెందడంతో తల్లిదండ్రులు రోధించారు. తమ కుమార్తెను సరైన వైద్యం అందించలేదనీ, వైద్యుల నిర్లక్ష్యమే బాలిక ప్రాణాలు బలితీసుకుందంటూ హాస్పిటల్‌లోనే ఆందోళనకు దిగారు.
పోస్టుమార్టం చేయరా?
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ బోధనాసుపత్రి (సర్వజన ఆసుపత్రి)లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించే పరిస్థితి కానరావడం లేదు. ఒక బాలిక వైద్యం పొందుతూ ఆకస్మికంగా మృతి చెందినా బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే పంపివేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరి ఒత్తిడితో, సిఫార్సుతో పోస్టుమార్టం చేయలేదో ? తెలియాల్సి ఉంది.


