కైకలూరు: ‘అవినీతి, అక్రమ కేసులు, మట్టి మాపీయా, పిల్లల విక్రయాలు, గంజాయి అమ్మకాలు, చేపల దొంగతనాలు, పేకాట, పొట్టెళ్ల పందాలు, ఇటువంటి వాటిని అడ్డుకోలేని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారని, అధికారంలోకి రాగానే అట్టుకు అట్టున్నర వడ్డిస్తాం’ అని వైఎస్సా ర్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) హెచ్చరించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ మద్దతుతో పాలన సాగించిన మాజీ సర్పంచులకు మంగళవారం సన్మానం చేశారు. కూటమి నుంచి కై కలూరు మాజీ సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆమెకు డీఎన్నార్ కండవా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి పాలనలో తన కుటుంబానికి చెందిన 100 ఎకరాల చేపల చెరువులో రౌడీ మూకలతో మూడు రోజుల పాటు రూ.48 లక్షల విలువైన చేపలను పట్టివేశారన్నారు. ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ఆయన గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వద్ద ప్రమాణం చేస్తే తన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లోనే చేపల దొంగ అనే పదం వాడనని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా కై కలూరు సీహెచ్‌సీని 50 పడకల ఆస్పత్రిగా మార్పు, డయాలసిస్ సెంటర్, సున్నంపూడి నుంచి గొల్లగూడెం పైపులైన్, గుడ్లవల్లేరు వద్ద స్లూయిజ్ తొలగింపు, పెద్దింట్లమ్మ వారధి, అనివేటిమండపం, వెంకటాపురంలో పాలిటెక్నిక్ కాలేజీ, 100 ఎకరాల్లో గ్రీన్ విలేజ్, వైవాకలో 317 మంది దళితులకు పట్టాలు, సంతమార్కెట్ క్లాంప్లెక్సు, పెనుమాకలంక రోడ్డుకు శంకుస్థాపన ఇలా అనేకం చేశామన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకున్నట్లు గ్రీన్ విలేజ్, పాలిటెక్నిక్ కాలేజీలకు పేరు మారుస్తున్నారన్నారు. గోపవరంలో 220/33 విద్యుత్ సబ్‌స్టేషన్ తానే తీసుకొచ్చానని చెప్పారు. కూటమి నాయకులకు వంత పాడుతున్న కై కలూరులో ఇద్దరు పోలీసు అధికారులు ఇక్కడ నుంచి వెళ్లినా వైఎస్సార్ సీపీ పాలన రాగానే వారితోనే ఇక్కడే డ్యూటీలు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే కామినేని హావభావాలను అనుకరిస్తూ డీఎన్నార్ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో బాబు మిస్సింగ్ కేసు 100 రోజుల దాటినా కనిపెట్టలేదన్నారు. బంధువులు రోడ్డుపై ధర్నా చేసిన తిరిగి వారిపైనే కేసులు కడతామని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. పసిపిల్లల విక్రయాలు కేసులో మరింత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముదిరాజుల విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీ గంటా సంధ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
డీఎన్నార్ హెచ్చరిక


