దెందులూరు: మండలంలోని కొవ్వలి గ్రామంలో ధాన్యం బస్తాలతో వస్తున్న లారీ కాలువలో బోల్తా పడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 650 బస్తాలతో లోడుతో ఉన్న లారీ కాలువలో బోల్తా పడింది. కొవ్వలి గ్రామానికి చెందిన గరికపూడి సత్యనారాయణ కౌలు రైతు దాళ్వాసాగు చేసి పండిన ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొలంలోకి నేరుగా లారీ వెళ్లి అక్కడే బస్తాలును లోడ్ చేసుకుని మిల్లుకు తరలించేందుకు వస్తుండగా చేపల ఫారం సమీపంలో వచ్చేసరికి లారీ అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. దీనివల్ల ధాన్యం మొత్తం తడిచి పనికి రాకుండా పోయింది. లారీ తో సహా దాన్యపు బస్తాలు నీటిలో మునిగిపోవడంతో రూ.8 లక్షలు నష్టం జరిగిందని కౌలు రైతు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.
టి.నరసాపురం: ఆయిల్ పామ్ తోటలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం ఈ నెల 25న జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి రామచంద్రరావు (40) గుడికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చాడన్నారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు రామచంద్రరావు కోసం వెతుకున్నారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న సాయంత్రం మండలంలోని తిరుపతిపాడు గ్రామ శివారులో ఓ రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో రామచంద్రరావు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంసభ్యులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామచంద్రరావు మద్యానికి బానిసై బయట వ్యక్తులకు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, షుగర్ వ్యాధి వచ్చి ఆరోగ్యం క్షీణించడంతో మానసికంగా బాధపడుతున్నాడన్నారు. రామచంద్రరావు మృతిపై మృతుని అన్న నాగ పుల్లారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నరసాపురం రూరల్: మండలంలోని కాళీపట్నం తూర్పు గ్రామంలో నిద్రస్తున్న సమయంలో పాము కాటుకు గురై గ్రామానికి చెందిన బాలం కొండబాబు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కొండబాబు తన ఇంటిలో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు బాలం రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.నాగేశ్వరరావు తెలిపారు.
దెందులూరు: మసీదుపాడు గ్రామానికి చెందిన పైడి తరుణ్‌ను ఈనెల 26న సానిగూడెం అడ్డరోడ్డు వద్ద కత్తితో నరికి గాయపర్చిన గాలాయగూడెం గ్రామానికి చెందిన కూచిపూడి హర్షవర్ధన్‌ను అరెస్ట్ చేశామని దెందులూరు ఇన్‌చార్జ్ ఎస్సై ఆర్.శ్రీను మంగళవారం విలేకరులకు తెలిపారు. గాయపడ్డ బాధితుడు తరుణ్ చెల్లెలు వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇతర విషయాలపై ఇద్దరికి ఘర్షణ జరిగిన నేపథ్యంలో దాడి చేశాడని స్పష్టం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేశామని వివరించారు.


