జంగారెడ్డిగూడెం: ఆయిల్ పామ్ లోడ్ లారీ మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని పుట్లగట్లగూడెంలో జంగారెడ్డిగూడెం–ఏలూరు రాష్ట్ర రహదారిపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన చల్ల మౌళి (17) మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుని, తన మోటార్‌సైకిల్‌పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. పుట్లగట్లగూడెం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆయిల్ పామ్ లోడ్ లారీ మౌళి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై షేక్ జబీర్ సిబ్బందితో కలిసి ఘటనానికి స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి మౌళి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. అయితే మృతుడు చల్ల మౌళి (17)కి తండ్రి లేకపోవడంతో నాయనమ్మ భగవతి వద్ద పెరిగినట్లు బంధువులు తెలిపారు. మౌళి కూలి పనులు చేసుకుంటూ నాయనమ్మకు ఆసరాగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మౌళి మృతితో వృద్ధురాలు భగవతికి ఆధారం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇటీవల ఏర్పడిన డీజిల్ కొరత పరిస్థితి క్రమంగా తగ్గుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రోజురోజుకూ డీజిల్ సరఫరా పెరుగుతుండగా, వినియోగదారులు అవసరం మేరకే కొనుగోలు చేయడం వల్ల పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని ఆయన వెల్లడించారు. మంగళవారం రాత్రి భీమవరం పట్టణంలోని ఉమామహేశ్వర ఆగ్రో సర్వీసెస్ పెట్రోల్ బంక్, పుష్ప పెట్రోల్ బంక్, ఉండి ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలోని పౌర సరఫరాల శాఖ పెట్రోల్ బంక్, గణపవరంలోని పెట్రోల్ బంకులను రాహుల్‌కుమార్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో డీజిల్ అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు.


