ఆక్వా, వ్యవసాయానికి తప్పని ఇబ్బందులు
నో ఆయిల్.. నో స్టాక్.. పెట్రోలు బంకులకు నాలుగువైపులా తాళ్లు కట్టి మరీ ప్రత్యేక ఏర్పాట్లు.. బంకుల ముందు 300 నుంచి 500 మీటర్ల మేర భారీ క్యూలైన్లు.. 10 లీటర్ల డీజిల్, 2 లీటర్ల పెట్రోలు కావాలంటే కనీసం రెండు గంటలు పడిగాపులు అనివార్యం.. ఇక మండలాల్లో అయితే క్యాన్లు పట్టుకుని మరీ అన్నదాతల పడిగాపులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల డీజిల్ కోసం ఆటోడ్రైవర్లు బారులు తీరిన దృశ్యాలు. ఇది పెట్రోలు, డీజిల్ కొరత పరిస్థితి.
ఏలూరు అశోక్‌నగర్ బంకు వద్ద ఆటోలు
సాక్షిప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత తారాస్థాయికి చేరింది. రెండు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ నిల్వలు గణనీయంగా తగ్గడంతో వాహనదారులు బారులు తీరుతున్నారు. డిమాండ్‌కు తగినంతగా సప్లయ్ లేకపోవడంతో అన్నదాతలు మొదలు ఆటోడ్రైవర్ల వరకు అందరూ ఇంధన కొరతతో అతలాకుతలమ వుతున్న పరిస్థితి. ఇక ప్రభుత్వం మాత్రం యథావిధిగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లు, ఆకస్మిక తనిఖీ లు, ఆయిల్ డీలర్లతో సమావేశాలు నిర్వహి స్తూ హడావుడి చేస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దలేకపోతోంది. ఏలూరు జిల్లాలో 232, పశ్చిమగోదావరి జిల్లాలో 160 పెట్రోలు బంకులున్నాయి. ఏలూరు జిల్లాలో రోజుకు సగటున 3.65 లక్షల లీటర్ల డీజల్, 2.60 లక్షల లీటర్ల పెట్రోలు, అలాగే పశ్చిమగోదావరిలో 3.50 లక్షల లీటర్ల డీజిల్, సుమారు 2 లక్షల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నా రు. ద్విచక్రవాహనాలు, కార్లు, సాధారణ గృహావసరాలకే కాకుండా వ్యవసాయం, ఆక్వా, ప్రైవేటు రవాణా ఇలా అన్నింటిలో డీజిల్ వినియోగం అ త్యధికంగా ఉంటుంది.
వరి కోతలకు తప్పని వెతలు
ప్రధానంగా ఏలూరు జిల్లాలో ధాన్యం రవాణా లారీలకు, కోతల సమయంలో యంత్రాలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంది. అలాగే ఆక్వాకు రోజు సగటున ఏలూరు జిల్లాలో 15 నుంచి 20 వేల లీటర్ల డీజిల్ ఏలూరు జిల్లాలో, పశ్చి మలో 30 నుంచి 40 వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి మా ర్కెట్‌లో డీజిల్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడం, కంపెనీలు అవసరాలకు అనుగుణంగా డీజిల్ సరఫరా చేయకపోవడం అధికారులకు ఆయిల్ కంపెనీలతో సమన్వయలోపం ఉండటం వెరసి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
అధికారుల హడావుడి
ఏలూరులో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, పశ్చిమగోదావరిలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పెట్రోలు బంకులు తనిఖీలు చేశారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్‌లో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు ఉంటే ఫోన్ చేయాలని నంబర్లు ప్రకటించారు. అలాగే తహసీల్దార్లు తదితర అధికారులు బంకుల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమలో ఆక్వా సాగు అత్యధికంగా ఉంది. రెండు జిల్లాల్లో కలిపి సగటున 50 వేల లీటర్ల డీజిల్‌ను ఆక్వా సాగుదారులు ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ నింపే ఏరియేటర్లు తిరగటానికి, చెరువులో నీటిని నింపుకునేందుకు మోటార్లు, అలాగే అప్రకటిత కరెంట్ కోతలు ఉన్న సమయంలో జనరేటర్ వినియోగానికి డీజిల్ తప్పనిసరి. దీంతో ఆక్వా రైతులు రెండు జిల్లాల్లో బంకుల వద్ద భారీగా క్యూలు కట్టారు. కొన్నిచోట్ల మాత్రమే రెండు గంటలకుపైగా పడిగాపులు కాస్తే 5 లీటర్ల డీజిల్ ఇస్తున్నారు. వాహనాలకు మాత్రమే ఇంధనం సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారని, డబ్బాల్లో ఆయిల్ నింపమని బంకు సి బ్బంది చెబుతున్నారు. దీంతో పాటు ఏ లూరు జిల్లాలో ధాన్యం రవాణా లారీలు, కోతల సమయంలో యంత్రాల వినియోగానికి రోజూ వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. పూర్తిగా కొరత ఉండటం, అనేకచోట్ల నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, మండల కేంద్రాల్లో పూర్తిగా నిల్వలు లేక బంకులు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఆయిల్ డ బ్బాలతో రైతులు అన్ని బంకులు తిరుగుతుండటం గమనార్హం. పశ్చిమగోదావరిలో రబీ సీజన్ నేపథ్యంలో 2.80 లక్షల ఎకరాల్లో కో తలు జరుగుతున్నాయి. సుమారు 1,675 కో త యంత్రాలకు రోజుకు సగటున లక్ష లీటర్లు డీజిల్ అవసరం. కానీ వందల లీటర్లు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కోతలపై తీవ్ర ప్రభావం పడింది.
ఇంధన వెతలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత
బంకుల వద్ద భారీగా క్యూలైన్లు
ఏలూరులో ప్రధాన బంకుల వద్ద అర కిలోమీటర మేర క్యూలైన్లు
ధాన్యం కోతలు, రవాణాకు తప్పని డీజిల్ కష్టాలు
ఆక్వా రైతులకూ అవే తిప్పలు
బంకులు తనిఖీ చేసిన కలెక్టర్లు, ఎస్పీలు
ప్రైవేటు రవాణారంగంపై తీవ్ర ప్రభావం


