ద్వారకాతిరుమల: సహస్ర నామాలతో భక్తజన నీరాజనాలు అందుకునే చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు చరాచర సృష్టిని ఆహ్వానిస్తూ.. సోమవారం రాత్రి నిర్వహించిన ధ్వజారోహణ వేడుక భక్తజన కోటికి కనుల పండువయ్యింది. వైఖానస ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులను, భేరీ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ లాంఛనంగా వేద మంత్రోచ్ఛరణలతో శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడపటాన్ని అర్చకులు ఎగురవేశారు. ఉదయం ఆలయంలో ఉత్సవ నిత్యహోమ గ్రామ బలిహరణలు, వేద స్వస్తి, సాయంత్రం రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారి సత్యా కృష్ణుని అలంకారం ఆకట్టుకుంది. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. సాయంత్రం ఆలయంలో అంకురార్పణ వేడుక అట్టహాసంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించే దిశగా గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణను వైభవంగా నిర్వహించారు. అర్చకులు పంపిణీ చేసిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరించారు. ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారన్నది భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాల్లో నేడు
● ఉదయం 7 గంటల నుంచి.. సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం.
● రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ
● శ్రీవారి ప్రత్యేక అలంకారం : అహల్య శాపం విమోచనం


