భీమడోలు: పెట్రోల్, డీజిల్ కొరత కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి సరుకు కొనుగోలుకు క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, యూరియా, గ్యాస్ కోసం ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా.. తాజాగా డీజిల్, పెట్రోలు కోసం బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదంతా విజన్ ఉన్న చంద్రబాబుకు ముందుగా తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్యూ కట్టకుండా దొరికేది కేవలం మద్యం మాత్రమేనని విమర్శించారు. విజయవాడ నుంచి తిరుపతి వరకు హైవేలపై బంకులన్నీ మూసివేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. వరి కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ సరఫరా చేయకుండా నాలుగు రోజులుగా రైతులు, ప్రజలను మానసిక క్షోభను అనుభవిస్తున్నారన్నా రు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత విధానాలే ఇందుకు కారణమన్నారు. రవాణా రంగం కుదేలై నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నాయన్నారు. గంటల తరబడి పెట్రోలు బంకుల వద్ద ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ రాలేదని, ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. కూటమి ఫ్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని డీజిల్, పెట్రోలు సరఫరాను సాధారణ స్థాయికి తీసుకురావాలని వాసుబాబు డిమాండ్ చేశారు.


