విద్యుత్‌ వైర్లు తగిలి ఎండు గడ్డి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వైర్లు తగిలి ఎండు గడ్డి దగ్ధం

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

రాగివైరు చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్‌ ఏటీఎం పగులగొట్టిన వ్యక్తి అరెస్టు

భీమడోలు: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ట్రాక్టర్‌లోని ఎండు గడ్డి పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట గ్రామం నుంచి దెందులూరు మండలం రామారావుగూడెం వైపుగా రెండున్నర ఎకరాల గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్‌ భీమడోలు శ్రీవేంకటేశ్వర కళాశాల రోడ్డుకు వచ్చేసరికి కిందకు ఉన్న విద్యుత్‌ వైర్లను తాకడంతో ఒక్కసారి మంటలు రేగి ట్రాక్టర్‌లోని గడ్డి పూర్తిగా కాలి బూడిదైంది. ట్రాక్టర్‌ పాక్షికంగా దెబ్బతింది. సుమారు రూ.25వేల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక అధికారి వి.రవికుమార్‌ ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

ఏలూరు టౌన్‌: వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగివైరును చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్‌.సుస్మిత వివరాలు వెల్లడించారు. చింతలపూడి గ్రామశివారు ఎన్‌వీఎన్‌ కాలనీ సమీపంలోని బొల్లినేని డుండి అనే వ్యక్తి పొలంలో ఈనెల 17వ తేదీ రాత్రి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పగులగొట్టి కాపర్‌వైరు దొంగతనం చేశారు. దీనిపై 18న చింతలపూడి విద్యుత్‌ శాఖ ఏఈ పజ్జూరి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి సీఐ టీ.క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై కే.సతీష్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఆదేశాలతో ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 160 కిలోల రాగి వైరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చింతలపూడి ఎన్‌వీఎన్‌ కాలనీకి చెందిన చుండ్రు అనిల్‌కుమార్‌ అలియాస్‌ సన్నీ, యామర్ల వీరాంజనేయులు అలియాస్‌ వీరబాబు, బట్టువారిగూడెం కాలనీకి చెందిన అందుగుల వెంకటేశ్వరరావు, లింగపాలెంలో నివాసం ఉంటున్న ఎన్‌టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ పా షాతో పాటు మైనర్‌ బాలుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేసి చింతలపూడి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

కై కలూరు: మద్యం మత్తులో ఏటీఎం పగులగొట్టి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని కై కలూరు టౌన్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టౌన్‌ సీఐ ఏవీఎస్‌.రామకృష్ణ, ఎస్సై డి.వెంకట్‌కుమార్‌ పోలీసు స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం భుబలపట్నంలో వెల్పూరి నాగరాజు రొయ్యల చెరువుపై పనిచేయడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, గుల్లేలా పంచాయతీకి చెందిన వందలం నాగరాజు దాదాపు 3 నెలల క్రితం పనిలో చేరాడు. పని విషయంలో యజమాని తిట్టడంతో ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. ఈ నేపధ్యంలో యజమాని ఈనెల 24న కై కలూరు రైల్వేస్టేషన్‌లో వందలం నాగరాజును దించాడు. అతడు తెల్లవారుజామున 3 గంటలకు మద్యం మత్తులో కేడీసీసీ ఏటీఎంలో డబ్బులు కోసం వచ్చాడు. ఏటీఎం కార్డు బదులు ఆధార్‌ కార్డును మిషన్‌ శ్లాట్‌లో పెట్టాడు. అది రాలేదు. దీంతో అప్పటికే పగిలి ఉన్న కీబోర్డును గట్టిగా కొట్టడంతో ఊడి వచ్చింది. దీంతో చేతిని గట్టిగా లోపలకి దూర్చి కార్డు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో డబ్బులు ఉంటే తీసుకోడానికి సిద్ధమయ్యాడు. చివరకు అతని వల్ల కాక పారిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement