ఇళ్లు కూల్చొద్దంటూ నిరసన | - | Sakshi
Sakshi News home page

ఇళ్లు కూల్చొద్దంటూ నిరసన

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

మా ఇళ్లు కూల్చొద్దు చాలాకాలంగా ఉంటున్నాం ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది

ఇంటి పట్టాలు ఇవ్వాలి

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మహిళల బైఠాయింపు

తమకు న్యాయం చేయాలని వేడుకోలు

ఉండి: మా ఇళ్లు కూలగొట్టొద్దు.. మా తాళిబొట్లు తాకట్టు పెట్టి మరీ కట్టుకున్నాం.. మా బతుకులు నాశనం చేయొద్దు బాబూ అంటూ మహిళలు అఽధికారుల కాళ్లవేళ్లా పడ్డారు. ఉణుదుర్రులోని ఆలకోడు వద్ద ఆక్రమణలు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో తమ ఇళ్లు కూల్చవద్దంటూ 70 కుటుంబాలకు చెందిన మహిళలు సోమవారం ఉండి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇళ్లు రోడ్డును ఆక్రమించుకుని గానీ, ఇతరులకు ఆటంకంగా గానీ లేకపోయినా గ్రామానికి చెందిన కొందరు కక్షకట్టి మా ఇళ్లు కూల్చి వాటిపై ఆక్వాచెరువులకు వెళ్లాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమపై ఎందుకింత కక్షకట్టారో తెలియడం లేదని వాపోయారు. మా ప్రాణాలైనా అర్పిస్తాం గానీ మా ఇళ్లు మాత్రం కూలగొట్టేందుకు అంగీకరించమంటూ వారు నినాదాలు చేశారు. అధికారులు మాకు స్థలం ఇస్తామని చెప్పి.. కనీసం పూడిక కూడా చేయని గోతిలో స్థలాలున్నాయి వెళ్లండి అని చెప్పడం ఎంత వరకు సమంజసమంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలకోడు ఆక్రమించుకున్న స్థానిక ఆక్వారైతులకు సహకరిస్తూ నిరుపేదల బతుకులు బుగ్గిచేయడానికి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం సబబు కాదని కన్నీళ్లు పెట్టుకున్నారు.

మా ఇళ్లు కూల్చొద్దు. మా జీవితాలు ఫణంగా పెట్టి ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు వాటిని కూలగొట్టేస్తామంటే మేం ఎలా బతకాలి. దయచేసి మా జీవితాలను నాశనం చేయవద్దు.

– కటికిరెడ్డి అన్నపూర్ణ, ఉణుదుర్రు

చాలాకాలంగా మేము ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాం. మేం నివసించే స్థలం ఎవ్వరికీ అడ్డులేదు. ఆక్వా,చేపల చెరువుల యజమానుల కోసం నిరుపేదల ఇళ్లు కూలగొట్టడం అన్యాయం.

కటికిరెడ్డి వెంకటసుబ్బమ్మ, ఉణుదుర్రు

మేం నివసిస్తున్న ప్రాంతంలో కాలువ పేరు చెప్పి నిరుపేదల ఇళ్లు కూలగొట్టేందుకు సిద్ధపడడం దారుణం. మాకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టి మా జీవితాల్లో నిప్పులు పోస్తోంది.

– కండిబోయిన పద్మ, మాజీ వార్డు సభ్యురాలు

కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉణుదుర్రు వాసుల ఇళ్లు అక్రమంగా కూలగొట్టడం దారుణం. జీవో నంబర్‌ 30 ప్రకారం నివసిస్తున్న ప్రాంతంలోనే నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలి. – ధనికొండ శ్రీనివాస్‌, సీపీఎం జిల్లా నాయకుడు

Advertisement
 
Advertisement
Advertisement