ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పెద్ద తిరుపతి దేవస్థానం అధికారులు సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ ఏఈఓ కె.మోహన్ రాజు, సిబ్బంది ముందుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలతో ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి వేద ఆశీర్వచనాన్ని, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలను స్థానిక దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావులకు అందించారు.
పెనుమంట్ర: వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) పరిశోధన సంచాలకులు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు జరిగే గోదావరి జిల్లాల మండల పరిశోధన, విస్తరణమండలి సమావేశాలను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ నానో ఎరువులు, డ్రోన్ టెక్నాలజీ, సేంద్రియ వ్యవసాయం, పోషక విలువలు కలిగిన రకాల అభివృద్ధి, ఎండాకు తెగులు యాజమాన్యం వంటి అంశాలపై పరిశోధనలను విస్తృతం చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందన్నారు. డాక్టర్ జి శివన్నారాయణ, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


