దెందులూరు: ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగిన ఘటన సానిగూడెం అడ్డరోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మసీదుపాడు గ్రామానికి చెందిన పైడి తరుణ్ చెల్లి, గాలాయగూడెం గ్రామానికి చెందిన కూచిపూడి హర్షవర్థన్ గతంలో ప్రేమించుకుని విడిపోయారు. ప్రస్తుతం ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే హర్షవర్థన్ సెల్‌ఫోన్‌లో ఆమె స్టేటస్ పెట్టుకోవడంపై తరుణ్ నిలదీయడంతో ఇద్దరికీ ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. అనంతరం పని నుంచి ఇంటికి వస్తున్న పైడి తరుణ్‌ను సానిగూడెం అడ్డరోడ్డు వద్ద కూచిపూడి హర్షవర్థన్ దారి కాచి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాధితుడు ఏలూరు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఏలూరు (టూటౌన్): వెలుగు వీవోఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే సుభాషిణి, జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకొని పొదుపు మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పార్వతి, ఉపాధ్యక్షులు విజయకుమారి, ఇందిరా, లక్ష్మీదేవి, లలిత కుమారి, కుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


