ప్రభుత్వం నియంత్రించాలి
సామాన్యులపై పెనుభారం
బుట్టాయగూడెం: పేదలపై ధరల దరువు తీవ్ర ప్ర భావం చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసర స రుకులు, కూరగాయల ధరల పెరుగుదల భారంగా మారింది. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో బతికేదెలా అంటూ సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా కూటమి నాయకులు ఎడాపెడా హామీలు గుప్పించారు. తీరా అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో ఇప్పటికే ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో ధరల బాదుడు వీరికి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకులు ధరలతో సతమతమవుతుండగా.. తాజాగా కూరగాయల ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడగా.. వంటకు కష్టాలు తప్పడం లేదు.
సామాన్యులకు వెజ్‘ట్రబుల్స్’
ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సా మాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయాల ధరలన్నీ పెరిగిపోయాయి. నాలుగు రోజుల్లో కూరగాయలు ధరలు కిలోకు రూ.30 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ.70కు పెరిగాయి. వారంతపు సంతల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కిలో నిమ్మకాయలు రూ.160, టమాటా రూ.40, చిక్కుడు రూ.140కు విక్రయిస్తున్నారు. కూ రగాయలు రకాన్ని బట్టి రూ.10 నుంచి రూ.30 వ రకు పెరిగినట్టు వినియోగదారులు చెబుతున్నారు.
నెత్తిన గుది‘బండ’
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదనుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ రూ.2 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ధరలను నియంత్రించడంతో పాటు గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలన్నీ మండిపోతున్నాయి. సామాన్య ప్రజ లు ఏమి కొనాలో? ఏమి తినాలో? తెలియక సతమతమతున్నారు. గత వారం కంటే ప్రస్తుతం కూరగాయల ధరలు కిలో రూ.30కు పైగా పెరిగాయి. ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కృషి చేయాలి.
– కారం రాఘవ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేత, అలివేరు, బుట్టాయగూడెం మండలం
రోజురోజుకూ ధరలు పె రుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల తీరుతో సామాన్యుడికి తీరని నష్టం కలుగుతోంది. వంట గ్యాస్ కూడా సకాలంలో దొరకని పరిస్థితి నెలకుంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
– తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం
ధరల దరువు
కూరగాయల ధరలకు రెక్కలు
తీరని వంట గ్యాస్ కష్టాలు
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంలో..
సామాన్యుడు బతికేదెలా?


