● వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● గజవాహనంపై అట్టహాసంగా శ్రీవారి తిరువీధి సేవ
● ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు
● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని
● రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణం
● రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై తిరువీధి సేవ
● శ్రీవారి ప్రత్యేక అలంకారం : సత్యా కృష్ణుని అలంకారం
ద్వారకాతిరువుల: సర్వాభరణ భూషితుడైన శ్రీవారు పెండ్లి కుమారుడిగా, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా శోభిల్లారు. ద్వారకాతిరుమలలో చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శ్రీహరి కళాతోరణ వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ఆలయం నుంచి నిత్య కల్యాణ మండపం వద్దకు తొళక్క వాహనంపై తీసుకెళ్లారు. అక్కడ వేదికపై అలంకరించిన సు వర్ణ సింహాసనంపై శ్రీవారు, అమ్మవార్లను వేంచేపు చేశారు. పండితులు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈఓ త్రినాథరావు దంపతులు పూలు, పండ్లు సమర్పించారు. అర్చకులు, పండితులకు నూతన వస్త్రాలు అందించారు. శ్రీహరి కళాతోరణం వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలంకరించాయి. రాత్రి గజ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారి శ్రీ మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు.


