జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఎర్రకాలువ జలాశయం మరోవైపున తవ్వకాలు
జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తవ్వేయ్.. తరలించేయ్.. అన్నట్టు ఇష్టానుసారంగా చెరువులు, కాలువ గట్లు, జలాశయాలను తవ్వేస్తున్నారు. మట్టిని తవ్వి కమర్షియల్ లేఅవుట్‌లకు, ఇటుక బట్టీలకు మట్టిని తరలించి లక్షలాది రూపా యలు దోపిడీ చేస్తున్నారు. వాస్తవానికి మట్టి తరలింపునకు అనుమతులు తీసుకున్నా, కేవలం రైతులు తమ పొలాలను మెరక చేసుకునేందుకు మాత్రమే తరలించాలి. కానీ మట్టి మాఫియా మాత్రం యథేచ్ఛగా కమర్షియల్ వెంచర్లకు మ ట్టిని తరలించేస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువలో జలాశయ గర్భాన్నీ తవ్వేస్తున్నారు. దీంతో జలాశయంలో భారీ గోతులు ఏర్పడి మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలతో ఎర్రకాలువ జలాశయానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం తప్పదని పలువురు అంటున్నారు. తవ్వకాలు ఇంతలా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అలాగే మండలంలోని శ్రీనివాసపురం, తిరుమలాపురం, కేతవరం తదితర గ్రామాల్లో చెరువులను తవ్వేసి మట్టిని కొల్లగొడుతున్నారు. కొయ్యలగూడెం మండలంలో బయ్యన్నగూడెం, యర్రంపేట, కనకాద్రిపురం, రాజవరం, గవరవరం, అలాగే జీలుగుమిల్లి మండలంలో కాలువ గట్లు, చెరువుల్లో కూడా మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. తాజాగా తాటియాకులగూడెంలోని చెరువుల్లో మట్టిని తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు.
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు


