ఏలూరు రూరల్: నగరంలోని సత్రంపాడు సిద్ధార్థ విద్యాలయంలో నాల్గో ఏజీసీఓ, ఎంకేపీజే రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి 114 మంది చిన్నారులు తరలివచ్చారు. వై.ప్రేమరక్షిత ప్రథమ, కుష్యంత్ ద్వితీయ, సీహెచ్ వివేక్ తృతీయ స్థానంలో నిలిచారు. వీరితో పాటు ప్రతిభ చాటిన కె.ఓంకార్, జి.కృష్ణారెడ్డి, జి.అవ్రహామ్, కె.తిషంకాకోటి, ఎ.అభిరామ్, జి.అనురూప్‌మోషే, జ్యోతిస్వరూప్‌లకు నిర్వాహకులు సర్టిఫికెట్లు, షీల్డ్స్ అందజేశారు. విజయ మల్టీస్పెషాలటీ హాస్పటల్ ఎండీ డాక్టర్ కల్పన, చెస్ అకాడమీ డైరెక్టర్ జి.యోహనాన్, ఎంకేపీజే డైరెక్టర్ వై.మహేష్, సెయింట్ ఆన్స్ కళాశాల అధ్యాపకులు కె.అరుణ, జి.స్వరూపరాణి, జి.విజయ్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని దుకాణాల్లో పనిచేసే కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సో మవారం ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు. కార్మిక సంఘాల నాయకులు తమ సంఘాల్లోని కార్మికులు స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 6న మహాధర్నా నిర్వహించనున్నట్టు వైఎస్‌ఆర్‌టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వడ్లమూడి రామ్మోహన్, పగడాల సాంబశివరావు ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ఉదయం 10 గంటలకు మహా ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి 26 జి ల్లాల నుంచి వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొంటున్నారని, ఉపాధ్యాయ ఎ మ్మెల్సీలు టి.కల్పలతరెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి పాల్గొంటారన్నారు. ధర్నాకు వైఎస్సార్‌టీఏ మండల, జిల్లా నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తక్షణమే పీఆర్‌సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆగిరిపల్లి: త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఏడీఏ భవానీ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’లో ‘మొక్కజొన్నకు అందని మద్దతు ధర’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, ఆదేశాలు రాగానే ఏర్పాటుచేస్తామని ఏడీఏ భవానీ తెలిపారు.


