జై వాసవీ.. జైజై వాసవీ స్మరణలు మార్మోగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అశేష భక్తజనంతో పెనుగొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. అమ్మవారిని వెండి పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని బజారు రామాలయం నుంచి నగరేశ్వరస్వామి ఆలయం వరకు మహిళలు కలశాలతో ఊరేగారు. అడుగడుగునా భక్తులు నీరాజనాలు అర్పించారు. అనంతరం మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించారు. వాసవీ శాంతిథాంలో విశేష పూజలు, లక్ష కుంకుమార్చనలు జరిగాయి. సాయంత్రం వెండి రథోత్సవం కనులపండువగా జరిగింది. రాష్ట్రంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి వాసవీ మాలధారులు గణపతి, వాసవీ హోమాలు నిర్వహించి మాల విరమణ గావించారు.
–పెనుగొండ


