● 40 శాతం మేరే డీజిల్ సరఫరా
● బంకులపై తీవ్ర ఒత్తిడి
● డీజిల్, పెట్రోల్ కొరతతో ఇక్కట్లు
నూజివీడు: బంకుల యజమానులు అడిగినంత డీజిల్‌ను ఆయిల్‌కంపెనీలు సరఫరా చేయడం లేదు. 10వేల లీటర్లకు ఇండెంట్ పెడితే కేవలం 4వేల లీటర్లు ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. దీంతో డీజిల్ కోసం పెట్రోలు బంకులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీలు అడిగినంత డీజిల్‌ను ఎందుకు సరఫరా చేయడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మామిడి కోతలు, దాళ్వా వరికోతలు, మొక్కజొన్న నూర్పుడిలు ప్రారంభం కావడంతో ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కు వాహనాలు, వరికోత మిషన్లకు డీజిల్ అవసరం నెలకొంది. అంతేగాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి కేటాయించిన రైసుమిల్ వద్దకు తరలించాల్సి ఉండగా డీజిల్ కొరతతో లారీలు కదలడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, ధాన్యం విక్రయించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు లేకపోతే స్పీడ్ పెట్రోలు అంటగట్టేస్తున్నారు. ఇది లీటరుకు రూ.10 ఎక్కువైనప్పటికీ చేసేదేమీ లేక వాహనదారులు పోయించుకుంటున్నారు. డీజిల్, పెట్రోలు కొరతతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పలుచోట్ల బంకుల మూసివేత
జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోలు కొరతతో పెట్రోలు బంకుల వద్ద తమ వాహనాలకు డీజిల్, పెట్రోలు కొట్టించేందుకు ప్రజలు బారులు తీరారు. కొన్ని బంకులు అయితే డీజిల్, పెట్రోలు అయిపోవడంతో బంకులనే మూసివేశారు. డీజిల్ కొరత కారణంగా ట్రాక్టర్లు, వరికోత మిషన్లకు డీజిల్ దొరకక వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. వరికోత మిషన్ యజమానులు బంకుల వద్దకు క్యాన్‌లు తీసుకొని వచ్చి డీజిల్ కొట్టమంటే బంకుల నిర్వాహకులు క్యాన్‌లలో కొట్టేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో వరికోత మిషన్ యజమానులకు, పెట్రోలు బంకు నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటోంది. వరికోత మిషన్‌లను బంకు వద్దకు ఎలా తీసుకురావాలని నిలదీస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 59 పెట్రోలు బంకులుండగా పెట్రోలు వాహనదారులకు ఎంతోకొంత దొరుకుతుండగా డీజిల్ మాత్రం దొరకడం లేదు. దీంతో ఆటో వాలాలు, ట్రక్కు వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, టాక్సీలు, లారీలు, ట్రాక్టర్లు కదలని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి డీజిల్ కోసం పదుల సార్లు బంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాహనదారులు వాపోతున్నారు.


