ప్రభుత్వం గుర్తించాలి
● పూర్వీకుల నుంచి వస్తున్న బాట పండుగ
● ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్న ఆదివాసీలు
బుట్టాయగూడెం: సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గిరిజన నృత్యాలతో డోలు కొయ్యల వాయిద్యాలతో గిరిపల్లెలు సందడిగా మారాయి.
గిరిజనుల ఆచారం
ప్రతి ఏటా వేసవిలో మామిడికాయల కాపు చేతికి వచ్చిన తర్వాత ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ జరిగే వరకూ చిన్నపిల్లలతో సహా ఎవ్వరూ కూడా జీడిమామిడి, మామిడి, పనస పండ్లను ముట్టుకోరు. వాటివైపు కన్నెత్తి చూడరు. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. కొండరెడ్లు బాట పండుగ జరిపిన తర్వాతే మామిడి కాయలు, పనసకాయలు తింటారు. అలాగే కోయతెగలకు చెందిన గిరిజనులు ఉగాది తర్వాత నుంచి మామిడికాయ పండుగను వైభవంగా నిర్వహించిన అనంతరం తినడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ పండుగల్లో ప్రతి ఇంటికీ ఒక కోడి చొప్పున గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్ని కోళ్లను కోసి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు మేకలను కూడా కోసి దేవతలకు నైవేద్యంగా పెట్టి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ కూడా పాల్గొంటారు. బాట పండుగను కన్నారప్పాడు ఉప్పరిల్ల, ముంజులూరు, చింతకొండ, రేపల్లె, రేగులపాడు, తదితర గ్రామాల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. గిరిజనుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలని గిరిజనులు కోరుతున్నారు.
గిరిజన సంప్రదాయ పండుగలైన బాట పండుగ, మామిడికాయ పండుగ, చిక్కుడు, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలి. ఐటీడీఏ ద్వారా ఈ పండుగలను ఘనంగా జరిపించే విధంగా ఏర్పాటు చేయాలి. మా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగలను నేటికీ మేము ఆచరిస్తున్నాము.
– కొక్కెర భీమరాజు, అలివేరు, బుట్టాయగూడెం మండలం


