పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా | - | Sakshi
Sakshi News home page

పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

పెద్దింట్లమ్మా.. చల్లగా చూడమ్మా సుబ్రహ్మణ్యేశ్వరా శరణు రాట్నాలమ్మా నమోస్తుతే వనరూపిణీ.. విజయకారిణి

కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ ఆదివారం కనిపించింది. పాఠశాలలకు వేసవి సెలవులు వల్ల సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం విక్రయం, దేవస్థాన గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా మొత్తం రూ. 72,492 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

ముదినేపల్లి (కై కలూరు): సుబ్రహ్మణ్యేశ్వరా.. శరణు అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లో వేంచేసియున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌.గంగాశ్రీదేవి, ఆలయ చైర్మన్‌ బొంగు రవికుమార్‌, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దెందులూరు: పెదవేగి శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. సేవ టికెట్లు, దర్శనం, ప్రసాదాల విక్రయం తదితర సేవల రూపంలో అమ్మవారికి మొత్తం రూ.98,413 ఆదాయం లభించిందని ఆలయ చైర్మన్‌ మన్నె శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సతీష్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ తెలిపారు.

బుట్టాయగూడెం: కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడి దర్శనార్థం ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అలాగే విజయవాడకు చెందిన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ నైవేద్యాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement