పాలకొల్లు సెంట్రల్: రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి చెబుతున్నా కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆవ డ్రెయినేజీపై గ్రావెల్ రోడ్డు నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. మండలంలోని పెదగరువు ప్రాంతంలో ఉన్న ఆవ మీడియం డ్రెయిన్‌పై రూ.17.69 లక్షల నిధులతో గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టారు. సహజంగా పుంత రోడ్డు నిర్మాణం చేయాలంటే ముందుగా జంగిల్ (మొక్కలు) శుభ్రం చేయాలి. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు తొలగించకుండానే షట్రు (పెద్ద రాళ్లు) వేసి గ్రావెల్ వేస్తున్నారు. గ్రావెల్ సైతం దాదాపుగా నాలుగు అంగుళాలు మందం వేయాల్సి ఉన్నా నామమాత్రంగా గ్రావెల్ వేసుకుని వెళుతున్నారు. అలాగే రోడ్డు సమానం చేయకుండా ఎత్తు పల్లాలుగా నిర్మాణం చేసుకుని వెళుతున్నారు. దీంతో రోడ్డు నిర్మాణంపై స్థానికులు, రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారికి ఫోన్ చేయగా ఆయన అందుబాటులో లేరు.


