తణుకు అర్బన్: కారు, మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తణుకు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అడపా సత్యనారాయణ (48) తణుకులోని ఆసుపత్రిలో తన కుమార్తె ఉండడంతో మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. జాతీయ రహదారి షర్మిష్ట సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. ప్రమాదంలో మృతుడు నడుపుతున్న మోటార్ సైకిల్ నుజ్జునుజ్జు కాగా కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మితిమీరిన వేగం
జంక్షన్ ప్రాంతంలో వేగ నియంత్రణ నిబంధనలు ఉన్నా ఖమ్మంనకు చెందిన కారు అతి వేగంగా జంక్షన్‌లో రోడ్డు దాటుతున్న సత్యనారాయణ వాహనాన్ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. కారు వేగానికి ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ ఏకంగా డివైడర్ ఎక్కి ఆగింది. వేగం కారణంగా నిండు ప్రాణం బలైపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కారు ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి


