డీజిల్‌కు ప్రత్యామ్నాయం లేదు
జిల్లా వ్యాప్తంగా ఈనెల 26, 29, 30న, అలాగే మే 7, 8, 9, 13 తేదీల్లో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లివారు వివాహాలు, రిసెప్షన్లు జరుపుకునేందుకు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎండ వేడి, ఉక్కబోత తీవ్రంగా ఉండటంతో ఏసీ ఫంక్షన్ హాల్స్‌కే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి వారి నుంచి ఫంక్షన్ హాల్స్ యజమానులు సెంట్రల్ ఏసీకి గంటకు రూ.2,500 నుంచి రూ.3 వేలు వరకు తీసుకుంటున్నారు. ఫంక్షన్ అయ్యే వరకు జనరేటర్ మీదే సెంట్రల్ ఏసీ పనిచేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఫంక్షన్ సజావుగా సాగాలంటే డీజిల్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఫంక్షన్ హాల్స్ యజమానులు అంటున్నారు.
ద్వారకాతిరుమల: గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. డీజిల్ కోసం అన్నదాతలు, ఆక్వా రైతులు, ఆటో కార్మికులు, లారీ డ్రైవర్లు రోడ్డెక్కాల్సిన దుస్థితి. పాలకుల అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నివర్గాల ప్రజలు డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నా.. కళ్లముందు బంకుల్లో క్యూలు పరిస్థితి అద్దం పడుతోంది. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో శనివారం డీజిల్ నో స్టాక్ బోర్డులే కనిపించాయి. ఉదయం కొన్ని బంకుల్లో డీజిల్ ఉన్నట్టు తెలుసుకున్న రైతులు, వ్యాపారులు, వాహన చోదకులు బారులు తీరారు. డీజిల్ నిల్వ చేసుకునేందుకు డబ్బాలు పట్టుకుని బంకుల వద్ద పడిగాపులు పడ్డారు. కొద్దిసేపటికే బంకుల యజమానులు డీజిల్ లేదంటూ చేతులెత్తేశారు. దాంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే లోడు లారీలు రహదార్లపై భారీగా నిలిచిపోయాయి. ప్రస్తుతం జరిగే వివాహాలపై డీజిల్ ఎఫెక్ట్ పడింది.
డీజిల్ కొరత కొనసాగితే ప్రజలకు ఇక్కట్లు తప్పవు. రవాణా నిలిచిపోతే నిత్యావసర సరుకులతో పాటు, ప్రతి వస్తువు ధర రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అన్ని సరుకులు రవాణా చేసే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఉరుకులు పరుగులు
జిల్లా వ్యాప్తంగా జరిగే వేలాది వివాహాల్లో అధిక శాతం వివాహాలు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధిలోనే జరుగుతాయి. అధిక శాతం ఏసీ కల్యాణమండపాలే ఉన్నాయి. ఆదివారం క్షేత్రంలో భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపధ్యంలో దాదాపు కల్యాణ మండపాలన్నీ ముందే బుక్ అయ్యాయి. శనివారం డీజిల్ కొరత ఏర్పడడంతో ఫంక్షన్ హాల్స్ యజమానులపై పిడుగు పడింది. వెంటనే డీజిల్ కోసం పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొందరు యజమానులు పక్క రాష్ట్రంలోని సత్తుపల్లి నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకున్నారు.
ట్యాంకర్ డీజిల్‌ను రెండు మూడు రోజుల పాటు జనాలకు సరిపెట్టాలని బంకుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావు డీజిల్‌ను డబ్బాల్లో కొట్టొద్దని, ఒక్కొక్కరికి 10 లీటర్లు మాత్రమే అందించాలని బంకుల యజమానులకు సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం కొన్ని బంకులకు వచ్చిన ట్యాంకర్లు తక్కువ డీజిల్‌ను దిగుమతి చేసి వెళ్లిపోయాయి. దాంతో యజమానులు కొద్దిసేపు ఆయిల్ కొట్టి, లాక్ పడిందంటూ చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే డబ్బాల్లో ఆయిల్ కొట్టకపోతే తమకు ఇబ్బందులు తప్పవని పలువురు రైతులు అంటున్నారు.
ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండప సముదాయం
గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయం కట్టెలు. కానీ డీజిల్‌కు ప్రత్యామ్నాయం లేదు. దాంతో డీజిల్ కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. ఆదివారం నుంచి ఫంక్షన్‌లు భారీగా జరుగుతాయి. డీజిల్ లేకపోతే సెంట్రల్ ఏసీలు పనిచేయవు. అలాగే ఫంక్షన్ జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా ఇబ్బందే. వివాహాలను దృష్టిలో పెట్టుకుని ఫంక్షన్ హాల్స్‌కు ఎక్కువ డీజిల్ సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఓజీఆర్ కుమార్, ఎస్వీఎస్ ఫంక్షన్‌హాల్ యజమాని, ద్వారకాతిరుమల
జిల్లా వ్యాప్తంగా రైతులు, వ్యాపారులు, వాహనదారుల ఇక్కట్లు
పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం
దిక్కుతోచని స్థితిలో ఫంక్షన్ హాల్స్ యజమానులు


