వివాదాస్పదంగా తణుకు పోలీసు సర్కిళ్లు
సాక్షి, భీమవరం : ఆపద ఎదురైనప్పుడు ఎవరైనా రక్షణ కోసం చూసేది పోలీసుల వైపే. కాగా జిల్లాలోని పోలీసు లోకల్ బాస్‌లు కొందరు పాలక పక్షాల నేతలకు కొమ్ముకాస్తూ గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక సెటిల్‌మెంట్లు, పైరవీలు ఎన్నో చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలు, ఇతర నేతల వద్ద మెప్పు కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటున్నారు. 2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై రెండేళ్ల తర్వాత 2024 డిసెంబర్ 13న పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన 24 మందిపై కేసులు నమోదు చేశారు. కూటమి పాలన వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వారిని పాలకపక్షం నేతలు పోలీసుల అండతో కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు.
కక్షతో వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులు
అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసాన్ని అల్లరి మూకలు ముట్టడించి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుండా అడ్డుకున్నప్పుడు పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తణుకు వై జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదస్పదమైంది. అప్పుడు మొదలైన పోలీస్ పికెటింగ్ కొద్దిరోజుల క్రితం వరకు కొనసాగింది. అత్తిలిలో విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలు వివాదస్పదం కావడంతో కొద్దినెలలుగా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కూటమి హయాంలో జిల్లాలోని భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలు కోడిపందేలు, పేకాట తదితర జూదాలకు స్థావరాలకు నిలయంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు.
తణుకు పోలీసు సర్కిళ్లు వివాదస్పదంగా మారాయి. ఏళ్ల తరబడి కొందరు సర్కిళ్ల పరిధిలో తిష్టవేసి సెటిల్‌మెంట్లు వ్యవహారాలు నడుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు సర్కిళ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. జనవరి 25న తణుకు రూరల్ సీఐ, ఎస్సైలు, 27న అత్తిలి ఎస్సై లీవ్‌పై వెళ్లిపోయారు. రెండు రోజుల వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సెలవుపై వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరిలో తణుకు అర్బన్ సీఐ, ఎస్సైలను ఉన్నతాధికారులు రేంజ్ వీఆర్‌కు పంపడం గమనార్హం. ఫ్లెక్సీల వివాదాలు, ఇతర ఆరోపణలకు వారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆకివీడు సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
దళిత బాలికపై లైంగిక దాడికేసులో భీమవరం పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారా? అంటూ మండిపడింది. అధికార పక్షానికి చెందిన నిందితులను రక్షించేందుకు పోలీసులు కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ న్యాయం కోసం బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లా వ్యాప్తంగా బయటపడని ఉదంతాలెన్నో?.
నక్కల డ్రెయిన్‌లో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకోవాలని ఆచంటకు చెందిన రైతులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేక వారం క్రితం డ్రెయిన్ వద్ద బైఠాయించారు. స్థానిక కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు రైతులను నిర్భంధించి పక్కకు తరలించారు. మరుసటిరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకోసం ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఎండ తీవ్రతతో నీడ కోసం టెంట్ ఏర్పాటు చేసుకుంటుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలు అడ్డుకోవడం మాని తమపై జులం ప్రదర్శిస్తున్నారంటూ పోలీసుల తీరు పట్ల రైతులు నిరసన తెలిపారు.
పాలక పక్షాల సేవలో పోలీసు అధికారులు
నిబంధనలు తుంగలో తొక్కి రెడ్‌బుక్ రాజ్యాంగం
సెటిల్‌మెంట్లు, పైరవీలతో సరి
ఇప్పటికే వీఆర్, సెలవులో పలువురు సీఐలు, ఎస్సైలు
చర్చనీయాంశంగా భీమవరం పోలీసులపై హైకోర్టు అక్షింతల వ్యవహారం


