ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాలిసెట్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ పీ.సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లాలోని ఏలూరులో 9 కేంద్రాలతో పాటు జంగారెడ్డిగూడెంలో మూడు, నూజివీడులో మరో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఏలూరులోని 9 కేంద్రాల్లో మొత్తం 3248 మంది విద్యార్థులకు గాను 2905 మంది హాజరయ్యారు. జంగారెడ్డిగూడెంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 1272 మందికి 1149 మంది విద్యార్థులు హాజరు కాగా, నూజివీడులోని మూడు కేంద్రాల్లో మొత్తం 835 మంది విద్యార్థులకు 765 మంది విద్యార్థులు హాజరయ్యారు.
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని ఏలూరు రోడ్డు మహేంద్ర ట్రాక్టర్ షోరూం వద్ద 7 అడుగుల గోధుమ త్రాచుపామును గుర్తించారు. వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్ షాప్ దగ్గర స్క్రాప్ తీస్తుండగా రేకు కింద పాము ఉండటాన్ని గమనించి స్నేక్ సేవియర్స్ సొసైటీకి సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధి చదలవాడ క్రాంతి అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఏలూరు రూరల్ : మే 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆవరణలో రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్, ఉమెన్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 29న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు చేపట్టనున్నామని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన అథ్లెట్లను జిల్లా జట్లకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆసక్తి గలవారు రూ.100 ఎంట్రీ ఫీజు చెల్లించి ఆధార్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 6.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 6281431202 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
బుట్టాయగూడెం: జిల్లాలోని కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బ్యాక్‌లాగ్ సీట్లకు, ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం బాలుర గురుకుల పాఠశాల, బుట్టాయగూడెం గురుకుల పాఠశాల, జీలుగుమిల్లి బాలుర గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్లను ప్రవేశ పరీక్ష మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 22 నుంచి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్ 15వ తేదీన సంబంధిత పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
భీమవరం(ప్రకాశంచౌక్) : దేవదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను పరిరక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వి రమేష్‌బాబు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు సంబందించి 700 ఎకరాల రికార్డులు పరిశీలించామని, దీనిపై సంబందిత ఈవోలు నివేదికలు సిద్ధం చేశారని తెలిపారు. తన పరిధిలోని 7 జిల్లాలకు సంబంధించి దేవాలయాల ఆస్తుల నివేదికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.


