కై కలూరు : ఆరేళ్ల లోపు పిల్లల మెదడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అందరి బాధ్యతని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ మీటింగ్ హాలులో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఆర్డీవో కిశోరు, ఐసీడీఎస్ అధికారి పి.శారద తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తహసీల్దారు కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మత్స్యశాఖ అధికారులలో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఆక్వా వాహనాలను రోడ్లపై పెట్టి నీటిని వదలడంతో రోడ్లు పాడవుతున్నాయని ఎమ్మెల్యే కలెక్టర్‌కు చెప్పారు. దీంతో ఆమె నాలుగు మండలాల రెవెన్యూ, ఫిషరీస్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు మీటింగ్ పెట్టి వాహనదారులకు అవగాహన కలిగించాలన్నారు.
సుఖ ప్రసవాలకు ప్రాధాన్యం
అన్ని డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్‌లో జరగాలని, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కై కలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టరు శనివారం తనిఖీ చేశారు. 50 పడకల హాస్పటల్‌లో పనిచేసే వారి వివరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటరు ప్రగతి సూచిక బోర్డులను పరిశీలించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. హాస్పిటల్‌లో స్కానింగ్ సెంటర్, రేడియాలజిస్ట్ పోస్టు, వైద్యుడి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.


