బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Apr 26 2026 2:33 AM | Updated on Apr 26 2026 2:33 AM

నేడు వరుడు కానున్న శ్రీవారు

ద్వారకాతిరుమల: చిన వెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 3తో ముగియనున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్‌ కటౌట్‌ చూపరులను ఆకట్టుకుంటోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను నిర్మించారు. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో నిర్వహించే శ్రీవారి తిరువీధి సేవలకు స్వామివారి వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికను సుందరీకరించారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ అక్స్‌ అఫీషియో కార్యదర్శి డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌కు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement