మొక్కజొన్నకు అందని మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నకు అందని మద్దతు ధర

Apr 26 2026 2:33 AM | Updated on Apr 26 2026 2:33 AM

పంట కోయకుండా వదిలేశాను

మద్దతు ధర రాలేదు

ఆగిరిపల్లి: మొక్కజొన్న దిగుబడి ఆశాజనకంగా ఉన్న ప్రభుత్వం మద్దతు లేకపోవడంతో ఆరుగాలం కష్టపడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం పంట పూర్తిగా కొతకు వచ్చి దిగుబడులు సైతం రైతు చేతికి వచ్చాయి. అయితే ఆశించిన ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం

మండలంలో 1,600 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను వేశారు. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం సైతం మొక్కజొన్న పంటకు క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు మద్దతు ధర అందని పరిస్థితి. దీంతో దళారులు రూ.1,600 నుంచి రూ.1,700కు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. చేసేది లేక రైతులు ఈ ధరకు అమ్ముకోవడంతో క్వింటాకు రూ.700 నుంచి రూ.800కు నష్టపోతున్నారు. అంటే ఎకరాకు సుమారు రూ.25 నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. అంతేకాకుండా దళారులు క్వింటా బస్తాకు అదనంగా కేజీ తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.

విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం

పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో క్వింటాల్‌ మొక్కజొన్నకు రూ.2,600 వరకు మద్దతు ధర లభించేది. అంతేకాకుండా ప్రతి ఏడాది మద్దతు ధర పెంచుతూ వచ్చింది. దీంతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నష్టం పోవడం అనే ప్రశ్న ఉండేది కాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్దతు ధర రూ.200 రూపాయలు తగ్గించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని రాష్ట్ర ప్రభుత్వం

రైతులను దోచుకుంటున్న దళారులు

కిలోకు రూ.700 వరకు నష్టపోతున్నామని ఆవేదన

నేను ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వేశాను. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు క్వింటా మొక్కజొన్నను రూ.1500కు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. దీంతో పంట కోయకుండా వదిలేశాను.

– దండిబోయిన వెంకటేశ్వరరావు, రైతు, ఈదులగూడెం

మొక్కజొన్న పంటకు శ్రమ, చీడపీడలు ఎక్కువే. పంట చివరి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నాం. మద్దతు ధర అందితే రైతులకు లాభం వచ్చేది. – గుజ్జర్లపూడి తిరుపతిరావు, రైతు, చొప్పరమెట్ల

Advertisement
 
Advertisement
Advertisement