ఉపాధ్యాయుల మహాధర్నా | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల మహాధర్నా

Apr 26 2026 2:33 AM | Updated on Apr 26 2026 2:33 AM

ఉపాధ్యాయుల మహాధర్నా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని పీఆర్‌ఆటీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ కమిటీని తక్షణం నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ ఏర్పాటు చేయాలని, ఈహెచ్‌ఎస్‌ (హెల్త్‌ కార్డ్స్‌) వినియోగంలో లోపాలను సరిచేసి అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అన్ని వ్యాధులకు వర్తించేలా చూడాలని, 1998, 2008 ఎంటీఎస్‌ టీచర్లను క్రమబద్ధీకరణ చేయాలన్న ముఖ్యమైన 27 డిమాండ్ల సాధనకై ధర్నా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించిందని, అయినప్పటికీ కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ఈ సెలవుల కాలంలో కూడా తరగతులు నిర్వహిస్తున్నట్టు అధికారుల దృష్టికి సమాచారం అందిందన్నారు. వేసవి సెలవుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను నిర్వహించడం గాని, విద్యార్థులకు తరగతులు నిర్వహించడం గాని పూర్తిగా నిషేధించినట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన పక్షంలో పాఠశాలల గుర్తింపు రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement