ఏలూరు మాదేపల్లిలో వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

ఏలూరు మాదేపల్లిలో వ్యక్తి హత్య

Apr 26 2026 2:33 AM | Updated on Apr 26 2026 2:33 AM

ఏలూరు మాదేపల్లిలో వ్యక్తి హత్య పారా అథ్లెట్‌ పవన్‌కుమార్‌ మరో విజయం హత్యాయత్నం కేసులో మరో ఐదుగురి అరెస్టు

పాతకక్షల నేపథ్యంలోనే గొడవ?

ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ పరిధిలోని మాదేపల్లి రోడ్డు వంకినేని ప్లాట్స్‌ సమీపంలో శనివారం రాత్రి ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కొట్టి హతమార్చారు. పదిమందికి పైగా వ్యక్తులు పేకాట ఆడుతూ ఉండగా... వివాదం చెలరేగి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, ఏలూరు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వంకినేని ప్లాట్స్‌ సమీపంలో రాత్రివేళ పేకాట ఆడుతూ ఉండగా... వివాదం చెలరేగి మాదేపల్లి ప్రాంతానికి చెందిన రాయి నూకరాజు అనే వ్యక్తిని పాలగూడెం ప్రాంతానికి చెందిన సంచర్ల మహేష్‌, సుంకరవారితోటకు చెందిన సత్తిబాబు అనే ఇద్దరు ఇటుకరాయిలతో తలపై విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. నిందితుల్లో ఒకరు మహేష్‌పై పోలీస్‌ షీట్‌ ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైన నూకరాజుకు భార్య, పిల్లలు ఉండగా, కూలిపనులు చేస్తుంటాడని తెలుస్తోంది. ఏలూరు రూరల్‌ పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. ఇంతకీ ఈ హత్యఘటనలో ఇద్దరు మాత్రమే ఉన్నారా ? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనేది పోలీస్‌ విచారణలో తేలాల్సి ఉంది.

ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెంకు చెందిన పారా అథ్లెట్‌ కస్సే పవన్‌ కుమార్‌ జాతీయ స్థాయిలో మరో విజయాన్ని సాధించాడు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ) నిర్వహించిన నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (ఎన్‌సీఓఈ) పారా అథ్లెటిక్స్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి శిక్షణకు ఎంపికయ్యాడు. ఖీ46 కేటగిరీలో పాల్గొన్న పవన్‌ కుమార్‌ 100 మీటర్లు, 200 మీటర్లు, లాంగ్‌ జంప్‌ ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అంతర్జాతీయ కోచ్‌లను ఆకట్టుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన అధికారులు అతనిని ఎన్‌సీఓఈ శిక్షణకు ఎంపిక చేశారు. ట్రైనింగ్‌ లిస్ట్‌ విడుదలైన తరువాత పవన్‌ కుమార్‌ గుజరాత్‌, బెంగళూరు, కేరళ లేదా కోల్‌కతా లోని ఎస్‌ఏఐ ఎన్‌సీఓఈ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత స్థాయి శిక్షణ పొందనున్నాడు.

పాలకొల్లు సెంట్రల్‌: ఈ నెల 16వ తేదీన యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామంలో నూకాలమ్మవారి జాతరలో రౌడీ షీటర్లు, కిరాయి వ్యక్తులు హల్‌చల్‌ చేసి కారుతో గుద్ది ఒక వ్యక్తిని హత్యచేసి మరో వ్యక్తిపై హత్యాయత్నం జరిపిన ఘటనలో బోణం గణేష్‌కుమార్‌తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మరో ఐదుగురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులను కోర్టు రిమాండ్‌కు పంపినట్లు రూరల్‌ సీఐ జి శ్రీనివాస్‌ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొరికిన ఐదుగురు నిందితుల్లో భీమవరంనకు చెందిన నలుగురు రౌడీషీటర్లు ఉన్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement