కొయ్యలగూడెం: అధికార గణం చేతులెత్తేయడంతో మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఎర్రంపేట శరత్ చంద్ర చెరువు నుంచి మట్టి అక్రమ రవాణా 8వ రోజైనా శనివారం కూడా కొనసాగింది. భారీగా టిప్పర్లను ఏర్పాటు చేసి ఇటుక బట్టిలకు సాగునీటి చెరువు మట్టిని తరలించారు. దీంతో ఎర్రంపేట, ఆరిపాటి గ్రామాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న రహదారి ఛిద్రమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.
కై కలూరు: ఆటపాక పక్షుల విహార కేంద్రంలో సంచరిస్తున్న మైనర్ ప్రేమజంటకు ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కై కలూరుకు చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక, ఇదే గ్రామానికి చెందిన యువకుడు (19) ఆటపాక పక్షుల విహార కేంద్రంలో సంచరిస్తుండగా జిల్లా ఐసీడీఎస్ పీడీ పీ.శారద వారిని చూసి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పీడీ శారద మాట్లాడుతూ నిర్మానుష్య ప్రదేశాలలో జంటలు ఎవరైనా కనిపిస్తే 181 లేక 1098 టోల్ ఫ్రీ నెంబర్లకు తెలియజేయాలని కోరారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్.సూర్యచక్రవేణి, మిషన్ కోఆర్డినేటర్ ఈ. తులసి, కై కలూరు సీడీపీవో దీప్తి, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ఈ ఘటనపై అటవీశాఖ రేంజర్ కె.రామలింగాచార్యులను వివరణ కోరగా పర్యాటకుల పేరుతో టిక్కెట్లు తీసుకుని లోపలకి వెళుతున్నారని, వారి మధ్య అనుబంధం తెలీయడం లేదన్నారు. ఇకపై సిబ్బందితో నిఘాను పటిష్టం చేస్తామన్నారు.
భీమవరం: నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ పొన్నమండ వెంకట మహాలక్ష్మి (40) శుక్రవారం రాత్రి భీమవరం పట్టణంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రహమాన్ చెప్పారు. గుంటూరుకు చెందిన పి విజయలక్ష్మి కుమార్తె వెంకట మహాలక్ష్మికి రాజమహేంద్రవరానికి చెందిన పొన్నమండ చంద్రశేఖర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వెంకట మహాలక్ష్మి నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తుండగా చంద్రశేఖర్ భీమవరం టూటౌన్ పరిధిలో సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి 1 గంట సమయంలో వారు నివాసముంటున్న ఇంటిలో ఆమె ఉరివేసుకోగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రహమాన్ చెప్పారు. డాక్టర్ వెంకట మహాలక్ష్మి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


