జంగారెడ్డిగూడెం: పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకువచ్చినపుడే రైతులు సంక్షోభం నుంచి బయటపడతారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఉద్దరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని సూర్య కిరణ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరగనున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు అశోక్ ధావలేకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను డీసీఎం వాహనం ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకునికి గాయాలయ్యాయి. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన పిన్నిబోయిన హరికృష్ణ (18) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. శనివారం మధ్యాహ్నం అడ్డరోడ్డు నుంచి తన ద్విచక్ర వాహనంపై తన మిత్రుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హరికృష్ణని చికిత్స కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి పంగిడియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


