ఏలూరు రూరల్ : మే 1 నుంచి 31 వరకూ జిల్లాలో చేపట్టనున్న 60 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతం చేయాలని సెట్‌వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఆట స్థలాలను పరిశీలించారు. అనంతరం డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఆధ్వర్యంలో జిల్లా స్కూల్‌గేమ్స్ సెక్రటరీ అలివేలుతో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల రోజుల పాటు సాగే క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొనే బాలబాలికలకు ఆటలపై ఆసక్తి పెంచాలన్నారు. ఉదయం 6 నుంచి 8 వరకూ, సాయంత్రం 5 నుంచి 7.30 నిమషాల వరకూ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఇందులో 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు శిక్షణ ఇచ్చి, ప్రతిభ గలవారిని గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల పిల్లలను శిబిరాలకు తరలివచ్చేలా కృషి చేయాలన్నారు.


