రేపటి నుంచి బ్రహ్మోత్సవ వైభవం | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి బ్రహ్మోత్సవ వైభవం

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

ప్రత్యేక అలంకారాలు

భక్తులు తరలిరావాలి

30న రాత్రి తిరుకల్యాణం, మే 1న రాత్రి రథోత్సవం

రోజుకో ప్రత్యేక అలంకారంలో శ్రీవారి దర్శనం

ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు ఇలలో ఓ అద్భుతం.. బ్రహ్మోత్సవాలను ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ద్వారకాతిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఏటా వైశాఖ మాసంలో వెలసిన స్వామికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠ స్వామికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 26 నుంచి శ్రీవారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీహరి కళాతోరణ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉత్సవ విశేషాలు

● ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు శ్రీవారిని పెండ్లికుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రాత్రి 7 గంటల నుంచి గజ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.

● 27న రాత్రి 7 గంటల నుంచి అంకురారోపణ, ధ్వజారోహణ, అనంతరం రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.

● 28న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాలు జరుగుతాయి.

● 29న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7.30 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం జరుగుతుంది.

● 30న రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.

● మే 1న రాత్రి 8 గంటల నుంచి క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది.

● 2న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సభ, రాత్రి 9 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం జరుగుతుంది.

● 3న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము–పవళింపుసేవ కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

పూర్తయిన ఏర్పాట్లు

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. చలువ పందిళ్లు నిర్మించారు. రాజగోపురాలు, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. రూ. 29 కోట్లతో నిర్మించిన అనివేటి మండప విస్తరణ, శాశ్వత క్యూ కాంప్లెక్స్‌, శివాలయం రాజగోపురాన్ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు.

ఈనెల 26న శ్రీ మహావిష్ణువు అలంకారం

27న సత్యా కృష్ణుడి అలంకారం

28న అహల్య శాపం విమోచన అలంకారం

29న శ్రీనివాస కల్యాణం అలంకారం

30న మోహిని అలంకారం

మే 1న శ్రీ కూర్మ అలంకారం

2న నవనీత కృష్ణ అలంకారం

3న శయన మహావిష్ణువు అలంకారం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో పాల్గొనే సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. 30న శ్రీవారి కల్యాణం, మే 1న రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26 నుంచి, వచ్చేనెల 3 వరకు నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం.

– వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ

Advertisement
 
Advertisement
Advertisement