నిమిషం ఆలస్యమైతే అనుమతించం
● నేడు జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో పరీక్ష
● పరీక్షలు రాయనున్న 5278 మంది విద్యార్థులు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిమిత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించి సౌకర్యాల కల్పనపై ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరులోని సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏ, బీ సెంటర్లు, సీఆర్‌ఆర్ జూనియర్ మహిళా కళాశాల, డిగ్రీ మహిళా కళాశాల, సీఆర్‌ఆర్ అటానమస్ కళాశాల, సీఆర్‌ఆర్ ఇంటర్మీడియట్ బ్లాక్, సీఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్, ఏలూరులోని సెయింట్ థెరిస్సా అటానమస్ కళాశాల ఉన్నాయి. వీటితో పాటు జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, సూర్య జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, నూజివీడులోని ఎస్‌ఆర్‌ఆర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లు ఉన్నాయి.
జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 5,278 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఏలూరులోని 9 పరీక్షా కేంద్రాల్లో 3,183 మంది విద్యార్థులు ఉండగా, జంగారెడ్డిగూడెంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 1,270 మంది రాయనున్నారు. నూజివీడులోని మరో మూడు పరీక్షా కేంద్రాల్లో 825 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు
ఈ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించడానికి జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, ట్రెజరీ, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు విద్య, విద్యుత్, రెవెన్యూ, ఆర్టీసీ శాఖలు సమయ్వనం చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక చికిత్సకు శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. దీనితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్‌గా వ్యవహరించడానికి మండల విద్యాశాఖాధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా సమయానికి అందుకునేలా తగిన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ఈ పాలిసెట్ పరీక్షలకు కూడా ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల లోపు విద్యార్థులంతా పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పీ. సుబ్రహ్మణ్యం,
పాలిసెట్ ఏలూరు జిల్లా కో–ఆర్డినేటర్


