మెట్టలో జల సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

మెట్టలో జల సంక్షోభం

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి

చింతలపూడిని పూర్తి చేయాలి

చింతలపూడి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వేసవి పూర్తిగా మొదలవ్వకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. జలవనరులు అడుగంటిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే, ఇటు పశువుల దాహం తీర్చేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఏర్పడేలా ఉంది. నియోజకవర్గ పరిధిలో దాదాపు 450కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో కళకళలాడాల్సిన ఈ వనరులు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. వేలాది ఎకరాలకు జీవనాడి అయిన ఆంధ్ర కాలువ, ఎరక్రా లువలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోర్లలో నీరు పడిపోవడంతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టిన తోటలు, పంటలు కళ్లముందే ఎండిపోయే పరిస్ధితి ఏర్పడింది.

పశువుల పరిస్థితి మరీ ఘోరం

రైతుకు చేదోడు వాదోడుగా ఉండే పశుగ్రాసం, పశువుల తాగునీటి సమస్య ఇప్పుడు జటిలంగా మారింది. చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి. పశువుల దాహం ఎలా తీర్చాలనేది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద ప్రశ్నగా మారింది. మెట్ట ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడానికి తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. మెట్ట ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇది పూర్తయితేనే వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా చింతలపూడి పథకం వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

చెరువుల్లో నీరు ఎండి పోవడంతో ప్రభుత్వం పశువుల తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువుల సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి కలిగించాలి. ఉపాధి హామీ నిధులతో చెరువుల పూడికను పూర్తి స్థాయిలో తీయిస్తే వర్షాకాలంలో చెరువుల్లో నీరు నిల్వ చేసుకోవచ్చు.

– ఖాదర్‌బాబు రెడ్డి,

నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు

ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను మళ్ళించాలి. రైతులకు శాశ్వత సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలి.

–కంభం విజయరాజు,

వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి

Advertisement
 
Advertisement
Advertisement