కుక్కునూరు: విద్యుత్ కోతలతో పోలవరం నియోజకవర్గ రైతులు అల్లాడుతున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్టు లేదని పోలవరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవారం కుక్కునూరు పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు మాట్లాడారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కట్ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తాము పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర అందక కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించడంతో పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుందని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలకు సరైన మద్దతు ధర అందక రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మేల్కొని రైతులకు మంచి చేసేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని, రైతులు పండించిన ఇతర పంటలకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గాడిద రాంబాబు, వైస్ ఎంపీపీ గాడిద రామచంద్రం, మండల యువజన విభాగం అధ్యక్షుడు చేకూరి నవీన్ వర్మ, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.


