జంగారెడ్డిగూడెం: సిమెంట్ విద్యుత్ స్తంబాల లోడుతో వెళుతున్న 16 చక్రాల లారీ అగ్నిప్రమాదానికి గురైంది. లారీ పూర్తిగా కాలిపోగా డ్రైవర్, క్లీనర్‌లు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం విజయవాడ నుంచి విద్యుత్ స్తంభాల లోడుతో బయలుదేరిన లారీ టి.నరసాపురంలో కొన్ని స్తంభాలు దించి, అక్కడ నుంచి జంగారెడ్డిగూడెం వచ్చి ఇక్కడ మరికొన్ని స్తంభాలు దించింది. అలాగే తడికలపూడిలో మరికొన్ని విద్యుత్ స్తంభాలు దించాల్సి ఉంది. మండలంలోని ఏలూరు – జంగారెడ్డిగూడెం రాష్ట్ర ప్రధాన రహదారి పుట్లగట్లగూడెం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి లారీ ఇంజిన్‌లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం గుర్తించిన తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పాతూరి పౌల్‌రాజు, క్లీనర్ శామ్యుల్ లారీ నుంచి దూకేశారు. లక్కవరం ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై భాస్కర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


