అటు కొరత.. ఇటు కోత | - | Sakshi
Sakshi News home page

అటు కొరత.. ఇటు కోత

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

ఆందోళనలో ఆక్వా రైతులు

డీజిల్‌ కొరతతో ఇబ్బందులు

ఆక్వా రంగానికి మినహాయింపు ఇవ్వాలి

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందాన ఆక్వా రైతుల పరిస్థితి

వేధిస్తున్న విద్యుత్‌ కోత, డీజిల్‌ కొరత

భీమవరం: ఆక్వా రంగాన్ని అందలమెక్కిస్తాం... రైతులను ఆదుకుంటామంటూ గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విద్యుత్‌ కోతలు, డీజిల్‌ కొరతతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఆక్వా రంగంపై మరింత ప్రభావం చూపుతోంది. ఒక పక్క డీజిల్‌ కొరతతో సతమతమవుతున్న రైతులు ఇటీవల విద్యుత్‌ కోతలు అధికం కావడంతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ కొరత ఏర్పడింది. ఆయిల్‌ కంపెనీలు రేషన్‌ పద్ధతిలో బంక్‌లకు డీజిల్‌ సరఫరా చేస్తున్నాయి. దీంతో చాలా చోట్ల బంక్‌ల వద్ద నోస్టాక్‌ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి.

రొయ్యల సాగుకు ఈ సమయమే కీలకం

రొయ్యల సాగులో వేసవికాలం రైతులకు ఎంతో కీలకం. మార్చి నెల నుంచి అనుకూల వాతావరణంతో రొయ్యల పెంపకానికి రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రొయ్యల చెరువులో ఎక్కువ సంఖ్యలో సీడ్‌ వేసి మంచి దిగుబడులు సాధించడానికి కృషి చేస్తారు. వేసవిలో రొయ్యల ఎదుగుదల బాగుండడం, పెద్దగా తెగుళ్లు లేకపోవడం వల్ల పెట్టుబడులు తగ్గి మంచి ఆదాయం పొందుతారు. ఇదే ఆశతో రైతులంతా జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దీనిలో రొయ్యల సాగు 90 వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. రైతులంతా రొయ్యల సాగుపై ఆశలు పెట్టుకున్న దశలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏరియేటర్స్‌ను ఎక్కువగా వినియోగించాల్సి ఉన్నందును విద్యుత్‌, డీజిల్‌ వాడకం అధికమైంది. ఇటువంటి తరుణంలో డీజిల్‌ కొరత ఏర్పడడం దానికి తోడు విద్యుత్‌ కోతలు పెరగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రధానంగా రాత్రి సమయంలో విద్యుత్‌ కోత ఏర్పడితే రొయ్యలు చనిపోతాయని రైతులు చెబుతున్నారు. కొంతమంది ఆక్వా రైతులకు సంబంధించిన విద్యుత్‌ కనెక్షన్‌న్లు, ఐస్‌ ఫ్యాక్టరీస్‌ ఇండస్ట్రియల్‌ ఫీడర్లు కింద ఉండడం ఇతర ఇండస్ట్రీస్‌తో పాటు రైతులు, ఐస్‌ ఫ్యాక్టరీలు కూడా విద్యుత్‌ కోతల బారిన పడుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.

ఆక్వా రైతులను డీజిల్‌ కొరత, విద్యుత్‌ కోతల నుంచి కాపాడాలంటూ ఆక్వా రైతుల సంఘం నాయకులు శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి ఉషారాణి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ తదితరులను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినందున తక్షణం చర్యలు తీసుకోకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.

రొయ్యల పట్టుబడిలో ఐస్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇండస్ట్రీయల్‌ పవర్‌ కట్‌ చేసే సమయంలో ఐస్‌ ఫ్యాక్టరీలకు విద్యుత్‌ కోత విధించడం వల్ల ఐస్‌ కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ఆక్వా రైతులకు విద్యుత్‌ కోతల నుంచి మినహాయింపు, డీజిల్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– గాదిరాజు వెంకటసుబ్బరాజు, వెస్ట్‌గోదావరి ప్రాన్‌ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి

రొయ్యల సాగుకు కీలమైన వేసవిలో విద్యుత్‌ కోతల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ఎక్కువ సమయం ఏరియేటర్స్‌ తిప్పాల్సివుంటుంది. ఇలాంటి సమయంలో విద్యుత్‌ కోతలు విధిస్తే ఏరియేటర్స్‌ తిరగక రైతులు నష్టపోతారు.

– మళ్ల తులసీరామ్‌, వెస్ట్‌గోదావరి ప్రాన్‌ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement