ప్రేమ వివాహం.. జంటపై దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం.. జంటపై దాడి

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

కుమార్తెను కిడ్నాప్‌ చేసిన తండ్రి , మరో ముగ్గురు

కేసు నమోదు చేసిన పోలీసులు

ద్వారకాతిరుమల: ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె తండ్రి, బంధువులు కలిసి కిడ్నాప్‌ చేశారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన ఆమె భర్త, అత్తమామలపై విచక్షణారహితంగా ఇనుప రాడ్లతో దాడి చేసి, గాయపరిచారు. మండలంలోని ఐఎస్‌ రాఘవాపురంలో గురువారం వేకువజామున జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ రాఘవాపురానికి చెందిన సంజిత్‌, కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన పద్మ ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పద్మ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో గతనెల 20న ఏలూరులోని అంబేడ్కర్‌ నవ సమాజ్‌ సొసైటీలో వారు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఐఎస్‌ రాఘవాపురంలోనే కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉంటే పద్మ తండ్రి వెంకటకృష్ణ, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, దుర్గారావు, వెంకటరమణలు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంజిత్‌ ఇంటికి వెళ్లారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం వారు పద్మను బలవంతంగా తీసుకెళ్లిపోతుండగా సంజిత్‌, అతని తల్లిదండ్రులు సలోమోను, శ్యామల అడ్డుకున్నారు. ఆ సమయంలో వారిపై ఇనుప రాడ్లతో దాడి చేసి, పద్మను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. గాయాలపాలైన సంజిత్‌, అతని తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో తెలిపి, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. అనంతరం సంజిత్‌ తండ్రి సలోమోను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కిడ్నాప్‌, తదితర సెక్షన్ల కింద ఎస్సై టి.సుధీర్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement