ఎంటీఎస్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎంటీఎస్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మినిమం టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ప్రాతిపదికన పని చేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంటీఎస్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు తోట ఎడ్వర్డ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎడ్వర్డ్‌ మాట్లాడుతూ ఎంటీఎస్‌ టీచర్లలో చాలామందికి 50 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఉద్యోగాలు వచ్చాయని, అందువల్ల వారి పదవీ విరమణ వయస్సును కనీసం 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే అందరు రెగ్యులర్‌ టీచర్లతో సమానంగా ఎంటీఎస్‌ టీచర్లూ పని చేస్తున్నారని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏడాదికి 11 నెలల జీతాలు మాత్రమే ఇస్తోందని, ఇకపై తమకూ 12 నెలల జీతాలూ ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఎంటీఎస్‌ టీచర్లకు కనీస పెన్షన్‌ విడుదల చేయాలని, అలాగే మినిమం టైమ్‌ స్కేల్‌ నుంచి తమను కూడా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఈ నెల 26న విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించే రిలే నిరాహార దీక్షల నిరసన కార్యక్రమానికి ఎంటీఎస్‌ టీచర్ల సంఘం మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ఈ మేరకు జిల్లాలో పని చేస్తున్న ఎంటీఎస్‌ టీచర్లు ఈ నెల 26న విజయవాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంటీస్‌ టీచర్ల సంఘం నాయకులు కె.స్వామిదాసు, కె.కరుణానిధి, వీవీ రాజు, ఎండీ పాషా, బాజీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement