అక్రమ చెరువుల జాతర | - | Sakshi
Sakshi News home page

అక్రమ చెరువుల జాతర

Apr 24 2026 10:52 AM | Updated on Apr 24 2026 10:52 AM

నిబంధనలు తప్పక పాటించాలి

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మత్స్యశా ఖాధికారులు ప్రజాప్రతినిధుల సిఫార్సులను కాదనలేకపోతున్నారు. అక్రమ చెరువులను ఆపండని జిల్లా అధికారులకు గ్రామస్తులు మెరపెట్టుకున్నా పొక్లయిన్లతో విధ్వంసం కొనసాగుతూనే ఉంది. వేసవి దాటితే తవ్వకాలకు అడ్డంకులని భావించి రాత్రి, పగలూ తేడా లేకుండా వందలాది ఎకరాల్లో చెరువుల జాతర మొదలయ్యింది. ప్రధానంగా ఆక్వారంగానికి ఆయువుపట్టుగా పేరొందిన కై కలూరు నియోజకవర్గంలో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత చెరువులు అన్న చందంగా యంత్రాల మోత మోగిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా తవ్వుతూ..

ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షలు, రొయ్యలు 1.10 లక్షలు కలిపి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు కలిపి 84,775.88 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కైకలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో ఆక్వా చెరువులు వందల ఎకరాల్లో తవ్వేస్తున్నారు. కొందరు మత్స్యశాఖ అనుమతులు ఉన్నాయని, మరికొందరు మరమ్మతులు చేసుకుంటున్నామని, ఇంకొందరు ఏకంగా ఎమ్మెల్యే పేరు చెప్పి దాబాయిస్తూ ఇష్టానుసారంగా చెరువులు తవ్వుతున్నారు.

అప్సడా చట్టం.. అభాసుపాలు : ఆక్వారంగం అభివృద్ధితో పాటు పర్యావరణానికి విఘాతం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) చట్టాన్ని తీసుకొచ్చారు. ఆక్వా జోన్ల వ్యవస్థ అందుబాటులో ఉంది. నూతన చెరువు తవ్వాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ)లో కలెక్టర్‌ అనుమతులు మంజూరు చేయాలి. ఇక డివిజన్‌, మండల స్థాయి కమిటీల్లో రెవెన్యూ, వ్యవసాయం, పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఇరిగేషన్‌, భూగర్భశాఖ ఇలా అన్ని శాఖలు తనిఖీలు చేసి ఓకే అంటేనే చెరువులు తవ్వుకోవాలి. ఇంత తతంగం ఉంటే ఇవేమీ మాకు వర్తించవంటూ ప్రజాప్రతినిధులు అండతో వందలాది ఎకరాలు తవ్వుతున్నారు.

ముదినేపల్లి ముందంజ

పచ్చని వరి పైర్లతో కళకళలాడే ముదినేపల్లి మండలం ఇప్పుడు సర్వం ఆక్వా చెరువులు మయంగా మారుతోంది. మండలంలో చేవూరు, ములకలపల్లి, వైవాక, చినపలపర్రు, పెయ్యేరు, పెదగొన్నూ రు, కాకరవాడ, కొత్తపల్లి, వణుదుర్రు, వాడవల్లి, కొత్తపల్లి, పెదపాలపర్రు, గోగినంపాడు గ్రామాలు, కలిదిండి మండలంలో మూలలంక, పెదలంక, గోపాలపురం, తాడినాడ, పుట్లపూడి, భాస్కరరావుపేట, సానారుద్రవరం, కోరుకొల్లు గ్రామాలు, మండవల్లిలో నందిగామలంక, కై కలూరు మండలంలో ఆలపాడు, శీతనపల్లి గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు తవ్వారు.

కొల్లేరును కొల్లగొడుతూ..

కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్టు, అక్రమార్కుల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. ఇటీవల చటాకాయి గ్రామంలో కొల్లేరులో బొదె పేరు చెప్పి ఏకంగా పెద్ద కాల్వనే తవ్వేశారు. ఇదే అదునుగా చటాకాయి గ్రామస్తులు అక్రమ గట్లుకు ఉపక్రమించారు. మీడియాలో కథనాలు రావడంతో చేసేది లేక బోదె పనులు 90 శాతం పూర్తయిన తర్వాత ఫారెస్టు అధికారులు ఆపేశారు. ఇప్పటివరకు గట్లును తొలగించలేదు. కొద్దిరోజుల క్రితం మండవల్లి మండలంలో కొల్లేరు ప్రాంతంలో చెరువు తవ్వకానికి పొక్లయిన్‌ దిగింది. ఫారెస్టు అధికారులు అతికష్టం మీద ఆపారు.

కొత్తగా చెరువులు తవ్వాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాలి. రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపితే వివిధ శాఖల అధికారుల కమిటీ అనుమతులు ఇస్తుంది. కై కలూరు నియోజకవర్గంలో కొన్ని చెరువులకు అనుమతులు ఇచ్చాం. అప్పడా నిబంధనలు అందరూ పాటించాలి.

– ఎం.రవికుమార్‌, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు, కై కలూరు

అడ్డంగా తవ్వేయ్‌!

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత చెరువులు

పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా రూపాంతరం

ఆక్వా రంగానికి చెందిన అప్సడా చట్టానికి తూట్లు

అక్రమాలపై ప్రజలు తిరగబడుతున్నా ఆగని వైనం

కొల్లేరు అభయారణ్యంలోనూ ఇదే తంతు

Advertisement
 
Advertisement
Advertisement